తాళే.. యమపాశంగా!

30 Jul, 2020 10:46 IST|Sakshi

పసుపుతాడు మెడకు బిగించి భార్యను కడతేర్చిన భర్త

గతంలో వేధింపులతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

బాగా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి హత్య

బీరు సీసాతో గొంతులో పొడుచుకుని తానూ ఆత్మహత్యాయత్నం

భర్త అరెస్ట్‌.. కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ 

పశ్చిమగోదావరి ,గణపవరం: అనుమానంతో భర్త పెట్టే వేధింపులు భరించలేక చంటిబిడ్డతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి, తాను కట్టిన తాళినే ఉరితాడుగా మార్చి కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తను గణపవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాలుగో నెల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అనుమానంతో ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ బుధవారం గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తి మద్యానికి బానిసై, మొదటి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె అతనిని నుంచి విడిపోయింది. గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండేళ్లక్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. భార్యను తరచూ వేధించడం, మద్యానికి బానిసై రోజూ కొట్టడంతో నంగాలమ్మ రెండు నెలలక్రితం పుట్టింటికి గణపవరం వెళ్లి, కొద్దిరోజుల తర్వాత ఐ.పంగిడిలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది.

అబ్బులు ఇటీవల పిప్పరలో ఒక చేపల చెరువుపై పనికి చేరాడు. అప్పటినుంచి భార్యను రమ్మని కబురు చేస్తూ పలుమార్లు బంధువులతో రాయబారం పంపాడు. తాను ఇకమీదట వేధించనని, చేయి చేసుకోనని, బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పి ఈ నెల 17న అబ్బులు తనతోపాటు భార్యను పిప్పర తీసుకువచ్చాడు. 18వ తేదీ రాత్రి అబ్బులు బాగా తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. నాలుగో నెల గర్భిణిగా ఉన్న ఆమెపై అనుమానంతో అదే రోజు రాత్రి భార్య మెడలో ఉన్న పసుపుతాడునే పీకకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తన భార్య పడుకుని కదలడంలేదంటూ కొంతసేపు హడావుడి చేశాడు. అనంతరం బీరు సీసాతో తన గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం తన తమ్ముడి ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడిని బుధవారం గణపవరం ఎస్సై ఎం.వీరబాబు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్, ఎస్సై వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా