రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..

17 Dec, 2022 15:57 IST|Sakshi
నిందితుడు రాంబాబు

నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): అగ్నిసాక్షిగా పెళ్లాడి, తోడునీడగా నిలుస్తానంటూ ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడిగా మారాడు. భార్యను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదికలో అసలు గుట్టు తేలడంతో.. తొలుత అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిని హత్యగా మార్చారు. నల్లజర్ల సీఐ లక్ష్మణరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లజర్లకు చెందిన బుసనబోయిన నాగేశ్వరావు, లక్ష్మి దంపతుల కుమార్తె తేజశ్రీకి చిన్నాయగూడేనికి చెందిన సంకుల రాంబాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

వారికి 13 నెలల పాప నందినీ సాయిదుర్గ ఉంది. ఏ పనికీ వెళ్లకపోవడంతో రాంబాబును అత్తింటివారు నల్లజర్ల తీసుకువచ్చి ఆటోమొబైల్‌ షాపులో గుమస్తాగా పెట్టారు. ఇటీవల దురలవాట్లకు బానిసైన రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్య తేజశ్రీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. దీనికితోడు తేజశ్రీకి శరీరంపై ఎలర్జీ రావడంతో డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లకుండా సూటిపోటి మాటలతో వేధించేవాడు.

ఒక రోజు పురుగు మందు తీసుకువచ్చి తాగుతావా లేదా అంటూ ఒత్తిడి చేశాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తేజశ్రీని రాంబాబు దవడపై కొట్టాడు. దీంతో సొమ్మసిల్లి పడిపోయిన భార్యను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఆమే ఫ్యానుకు ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించాడు. అప్పట్లోనే కుటుంబ సభ్యులు అతడిని అనుమానించారు. తేజశ్రీ మృతిపై పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసు విచారణలో రాంబాబే తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్టు వెల్లడైంది. దీంతో రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం.. ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని.. చివరికి..  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు