వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి..

1 May, 2022 15:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయనగరం క్రైమ్‌: వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. కట్టుకున్న భర్తను ప్రియుడితే చంపించి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది ఓ ఇల్లాలు. అయితే భర్త మృతి విషయమై పదే పదే ఆరా తీస్తుండడంతో పోలీసులకు ఆమెపైనే అనుమానం వచ్చింది. తీరా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఆమెతో వివాహేతర సంబంధం కొనిసాగిస్తున్న వ్యక్తే హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని, మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం సబ్‌ డివిజన్‌ల్‌ కార్యాలయంలో హత్యకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ అనిల్‌కుమార్‌ శనివారం వెల్లడించారు.   పూసపాటిరేగ పోలీస్‌ స్టేషన్‌ పరి«ధిలో ఏప్రిల్‌ 2న చంపావతి నదిపై ఉన్న  బ్రిడ్జి వద్ద ఆటో తిరగబడి  డెంకాడ మండలం దొడ్డిబాడువ గ్రామానికి చెందిన డోల రామకృష్ణ (51) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయమై అతని కుమార్తె డోల కృష్ణలత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయమై మృతుడి భార్య డోల లక్ష్మి పోలీసు స్టేషన్‌కి రావడం, ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు.  

బయటపడిన వివాహేతర సంబంధం.. 
మృతుడు డోల రామకృష్ణకి  27 ఏళ్ల కిందట లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రామకృష్ణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం వ్యసనానికి బానిస కావడంతో డబ్బుల్లేనప్పుడు భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణకు ఆమె సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీలో 11 ఏళ్ల కిందట హెల్పర్‌గా చేరింది. అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న బొక్కా దశకంఠేశ్వరరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దశకంఠేశ్వరరావు లక్ష్మి కుటుంబ సభ్యులతో కూడా సన్నిహితంగా మెలిగి, వారి అవసరాలకు డబ్బు సాయం చేస్తుండేవాడు. దశకంఠేశ్వరరావుతో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఏడాది కిందట మృతుడు గుర్తించాడు.

దీంతో భార్యతో ఎప్పటికప్పుడు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భావించి తన భర్తను చంపేయాలని లక్ష్మి, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. గతంలో ఒకసారి హత్య చేయాలని నిర్ణయించకున్నా కుదరలేదు. రెండోసారి పక్కాగా స్కెచ్‌ వేసి రంగంలోకి దిగారు. దశకంఠేశ్వరరావు, శంకరరావు అనే వ్యక్తి సాయంతో పేరాపురం వద్ద ఆటో వేస్తున్న రామకృష్ణను ఏప్రిల్‌ రెండో తేదీన కలిశారు. దగ్గర్లో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ పోయించారు. దారిలో మద్యం కొనుగోలు చేసి రాత్రి 8 గంటల ప్రాంతంలో పిట్టపేట గ్రామం కొండ వద్దకు ఆటోలో వెళ్లారు.

అక్కడే శంకరరావు ఉద్దేశపూర్వకంగా రామకృష్ణతో గొడవపడి ఆటో నుంచి బయటకు తోసేశాడు. తర్వాత రామకృష్ణ తలపై రాయితో గట్టిగా మోది చంపేశారు. అనంతరం ఆటోలో మృతదేహాన్ని ఎక్కించి నాతవలస బ్రిడ్జి వద్ద ఆటోను కిందకు తోసేసి, సెల్ఫ్‌ యాక్సిడెంట్‌ జరిగినట్లు చిత్రీకరించారు. అయితే మృతుడి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దశకంఠేశ్వరరావు, శంకరరావుతో పాటు లక్ష్మిని అరెస్ట్‌ చేశారు. కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్సై ఆర్‌. జయంతి , కానిస్టేబుల్‌ దామోదరరావు, పోలీసు సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు.   

మరిన్ని వార్తలు