ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. తీరా గర్భిణి అయ్యాక..

28 Apr, 2022 08:59 IST|Sakshi

ఖమ్మం క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం రేవతి థియేటర్‌ ప్రాంతానికి చెందిన ప్రీతిని అదే ప్రాంతానికి చెందిన తేజానూత్‌ సాయి మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

సాయి పాత బస్టాండ్‌ వద్ద అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వివాహమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఇరువర్గాల కుటుంబీకులు సర్ది చెప్పడం.. మళ్లీ కలసిపోవడం జరుగుతోంది. కాగా, సైకోలా వ్యవహరించే సాయి.. ఆమెను ఇష్టారీతిగా కొట్టడమేకాకుండా, చుట్టుపక్కల వారు అడ్డుకుంటే వారిపైనా దాడికి పాల్పడుతుండేవాడు. ఇటీవల గర్భం దాల్చిన ఆమెను అలాగే కొడుతుండటంతో పుట్టింటికి వచ్చింది. వీరిద్దరూ కలసి ఉండడం సాధ్యం కాదని భావించిన పెద్దమనుషులు విడాకుల పత్రం రాయించారు.

అయినా సాయి వచ్చి ప్రీతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే మూడు రోజుల క్రితం సాయి మళ్లీ కొట్టడంతో ప్రీతి పుట్టింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం ప్రీతి వద్దకు వచ్చిన సాయి, మాట్లాడే పని ఉందని సమీపంలోని తన ఇంటికి తీసుకెళ్లి గొడవ పడుతూ అరటి పండ్లు కోసే కత్తితో ఇష్టారీతిగా శరీరం పై పొడిచి తలుపు వేసి వెళ్లిపోయాడు. అయితే కత్తితో పొడుస్తున్నప్పుడు ఆమె గట్టిగా కేకలు వేసినా, ఎప్పుడూ జరిగే గొడవలే కావొచ్చని ఎవరూ పట్టించు కోలేదు. చివరకు ఆమె గావుకేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో ఉంది. వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె శరీరంపై అయిన గాయాలకు 80కుట్లు వేశారు. టూటౌన్‌ సీఐ శ్రీధర్, ఎస్సై రాము పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి..   

మరిన్ని వార్తలు