ఖమ్మం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఘాతుకం

6 Feb, 2021 04:24 IST|Sakshi
నవ్య (ఫైల్‌)

కట్టుకున్నోడే కడతేర్చాడు.. 

రెండు నెలల క్రితమే పెళ్లి.. ఆపై పక్కాప్లాన్‌తో హత్య 

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం 

సాక్షి, పెనుబల్లి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. నూరేళ్లు కలసి ఉంటామని మూడుముళ్లు వేసి, రెండునెలలకే భార్యను అంతమొందించాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని భావించిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తన భార్యను పక్కా ప్రణాళికతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫల ప్రయత్నం చేశాడు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన యరమల నాగశేషురెడ్డి ముంబైలో స్టాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అతడికి అదే మండలం అయ్యవారిగూడెంకు చెందిన బీటెక్‌ విద్యార్థిని నవ్య(23)తో గత ఏడాది డిసెంబర్‌ 9న వివాహం జరిగింది.

పెళ్లయిన కొద్దిరోజులకే భర్తకు మరో మహిళ నుంచి తరచూ ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో నవ్య నిలదీసింది. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని భావించి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సత్తుపల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న నవ్య ఫిబ్రవరి 2న కళాశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పెగళ్లపాడు నుంచి ఆమెను స్కూటీపై కళాశాలకని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో నవ్యకు నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ తాగించాడు. పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి కుక్కలగుట్ట సమీపంలోకి వెళ్లగానే నవ్య అలసటగా ఉందని చెప్పింది. దీంతో చెట్టు నీడన విశ్రాంతి తీసుకుందామని చెప్పి కుక్కలగుట్టపైకి తీసుకెళ్లాడు. నవ్య మెడకు ఉరి బిగించిచెట్టుకు వేలాడదీశాడు. 


నవ్య, నాగశేషురెడ్డి(ఫైల్‌) 

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం 
నవ్య సెల్‌ఫోన్‌ నుంచి ఆమె తండ్రికి వాట్సాప్‌ ద్వారా.. ‘నాకు ఇంజనీరింగ్‌లో కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌ ఉన్నాయి. సరిగ్గా చదువుకోలేకపోతున్నా, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’అని నవ్య రాసినట్టుగా మెసేజ్‌ పెట్టి స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. మరుసటిరోజు ఉదయం ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నవ్య, నాగశేషురెడ్డి ఫోన్ల కాల్‌డేటా, లొకేషన్లను విశదీకరించారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం, కుప్పెనకుంట్ల గ్రామాల్లో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీల్లో నాగశేషురెడ్డి, నవ్య స్కూటీపై ఫిబ్రవరి 2న వెళ్తుండగా రికార్డు అయిన వీడియోలు, ఫొటోలను గుర్తించారు. దీంతో నాగశేషురెడ్డిని అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. శుక్రవారం పోలీసులు నవ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వినీల మృతిపై అనుమానాలు.. 
ఎర్రుపాలెం:  కాగా.. పెగళ్లపాడు గ్రామ సమీపంలో గూడూరు వినీల (20) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈమె బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. నవ్య హత్య కేసులో నిందితుడు నాగశేషురెడ్డికి వినీల సమీప బంధువు కావడంతో ఈమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. హత్య కేసుకు సంబంధించిన వివరాల కోసం వినీలను పోలీసులు పిలిపించినట్లు తెలిసింది. అయితే ఆమె సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ భయంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య కేసుకు, వినీల ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా.. అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.   

చదవండి:  (పెళ్లి చేసే స్థోమత లేక అమ్మకానికి అమ్మాయి!)

మరిన్ని వార్తలు