ప్రేమ పేరుతో పెళ్లి: రెండు కిడ్నీలు పాడైపోయాయని...

24 Jul, 2021 20:02 IST|Sakshi
అంబురాజ్‌ ఇంటి ముందు తల్లిదండ్రులతో కలసి ధర్నా చేస్తున్న మేఘన ­­­­

‘ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. 14 ఏళ్లపాటు కలిసి ఉన్నాడు. ఇప్పుడు రెండు కిడ్నీలు పాడైపోయాయని పుట్టింట్లో వదిలేశాడు. ఆఖరు మజిలీలో భార్యగా అంగీకరిస్తే.. సుమంగళిగా వెళ్లాలని ఉంది’ అంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఎంబీఏ చదివిన ఓ యువతి ధర్నాకు దిగిన ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం చర్చనీయాంశమైంది.   

సాక్షి,మదనపల్లె టౌన్‌: తమిళనాడులోని మదురైకి చెందిన అంబురాజ్‌ 25 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. నీరుగట్టువారిపల్లె గజ్జిలకుంటలో తినుబండారాలు తయారు చేసి, దుకాణాలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన అక్క కూతురు నదియా ను 2001లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు దివ్యంగులున్నారు. ఇదిలావుండగా వ్యాపార అవసరాలకు అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యజమాని పెద్ద కూతురు బి.మేఘనను లొంగదీసుకున్నాడు. తరువాత ఉన్నత చదువుల పేరుతో ఇంటి నుంచి బయటకొచ్చిన మేఘన కు కురబలకోట మండలం, అంగళ్లులో ఓ దుకాణం పెట్టించిన అంబురాజ్‌ అప్పుడప్పుడూ ఆమె వద్దకు వెళ్లి వచ్చేవాడు.

అంబురాజ్‌ ప్రేమ వ్యవహారం మొదటి భార్య నదియాకు తెలియడంతో ఆమె పలుమార్లు ఇద్దరినీ మందలించింది. ఈక్రమంలోనే మేఘనను అంబురాజ్‌ రిజిస్టర్‌ వివాహం చేసుకున్నాడు. 14 ఏళ్లు కలిసి ఉన్నా మేఘనకు పిల్లలు కలగలేదు. ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేశాడు. మేఘనకు కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించగా వైద్యులు రెండు కిడ్నీలు పాడైపోయాయని తేల్చారు. తల్లిదండ్రులు మేఘనను ఇంట్లోనే పెట్టుకుని డయాలసిస్‌ చేయిస్తున్నారు. తన బిడ్డకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రు లు  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబురాజ్‌ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తాను భర్త ఇంట్లోనే ఉండి, సుమంగళిగానే మరణిస్తానని మేఘన చెబుతోంది.  పోలీసులు  ఇరువర్గాలను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.   

మరిన్ని వార్తలు