ఆ యువతితో ఉన్న 10 రోజులు మరుపురానివి.. తల్లిదండ్రులు ఇంత ఘోరం చేస్తారనుకోలేదు

20 Sep, 2022 15:04 IST|Sakshi
భార్యతో శక్తివేల్‌ (ఫైల్‌)

వేలూరు (చెన్నై): రాణిపేట జిల్లా వాలాజ పేట మండపం వీధికి చెందిన శక్తివేల్‌(26) సుంగాసత్రంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమించి.. ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చర్చించుకుని ఇద్దరిని ఒకటిగా చేర్చారు. ఇటీవల భార్యతో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో చేరేందుకు బస్సులో వెళ్లాడు. గమనించిన యువతి బంధువులు కారులో వెంబడించి శక్తివేలుపై దాడి చేసి యువతిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

వీటిపై శక్తివేల్‌ వాలాజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి మనో వేదనతో ఉన్న శక్తివేల్‌ ఇంటిలో ఓ లేఖ రాసి పెట్టి ఎలుకల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వేలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన శక్తివేల్‌ ఇంటిలో ఒక లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో తన వివాహానికి సాయం చేసిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తాను యువతితో జీవించిన 10 రోజులు మరుపురానివని, అయితే వారి తల్లిదండ్రులు ఇంతటి దారుణం చేస్తారని అనుకోలేదని వాపోయినట్లు తెలుస్తోంది.  

  చదవండి: (స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ) 

మరిన్ని వార్తలు