నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని.. చివరికి భర్త షాకింగ్‌ నిర్ణయం

17 Nov, 2022 20:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భవానీపురం(విజయవాడ పశ్చిమ): భార్య తన మాట వినటం లేదని మనస్తాపం చెందిన భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెం దుర్గమ్మ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట ప్రకాష్‌నగర్‌లో తన కుమార్తె దగ్గర ఉంటుంది. మార్బుల్‌ పని చేస్తూ జీవనం సాగించే ఆమె పెద్ద కుమారుడు కల్లెం లక్ష్మీప్రసాద్‌ (37)కి వివాహమయ్యి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

అయితే లక్ష్మీప్రసాద్‌ ఎనిమిదేళ్ల క్రితం మొదటి భార్యను వదిలేసి భవానీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని చిట్టినగర్‌ సాయిరాం సెంటర్‌ నాగమ్మ సత్రం ఎదురుగా ఉన్న అద్దాలవారి వీధిలో కొండపై ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో లక్ష్మీప్రసాద్‌ తల్లి దుర్గమ్మకు ఫోన్‌ చేసి తన రెండో భార్య భవానీ తన మాట వినటం లేదని, తాను వద్దంటున్నా పనికి వెళుతోందని చెప్పి బాధపడ్డాడు.

ఆ సమయంలో అతను మద్యం సేవించి మాట్లాడినట్లు తల్లి భావించింది. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో భవానీ అత్త దుర్గమ్మకు ఫోన్‌ చేసి లక్ష్మీప్రసాద్‌ ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని చెప్పింది. దీంతో దుర్గమ్మ వెంటనే లక్ష్మీప్రసాద్‌ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా ముందు గది అయిన బెడ్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు.

చూడాలని ఉందన్నాడు.. 
కోడలు భవానీని ఏం జరిగిందని అత్త అడుగగా ఉదయం 9.30 గంటలకు తాను పనిచేసే చోట దింపి ఇంటికి వెళ్లిపోతానని భర్త చెప్పాడని, మధ్యాహ్నం 12.45 గంటలకు ఫోన్‌ చేసి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అన్నాడని తెలిపింది. అయితే పనిలో ఉండగా ఫోన్‌ మాట్లాడితే ఓనర్‌ ఊరుకోడని, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని ఫోన్‌ పెట్టేశానని అత్త దుర్గమ్మకు చెప్పింది.

తిరిగి ఒంటి గంట సమయంలో పని నుంచి బయటకు వచ్చి భర్తకు ఫోన్‌ చేయగా ఫోన్‌ ఎత్తకపోవడంతో తమ ఇంటి పక్కనే నివసించే గంగ అనే మహిళకు ఫోన్‌ చేసి తన భర్త ఫోన్‌ ఎత్తడం లేదని ఒక సారి వెళ్లి చూడమని కోరానని తెలిపింది. ఆమె వెళ్లి చూడగా బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని చనిపోయి ఉన్నాడని చెప్పింది. భార్య తన మాట వినడం లేదని తాగిన మత్తులో క్షణికావేశంతో ఉరేసుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నానని మృతుడి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: శ్రద్ధా హత్య కేసు: అంతుపట్టని మరో ట్విస్ట్‌....నివ్వెరపోయిన పోలీసులు   

మరిన్ని వార్తలు