ప్రియుడి మోజులో భర్త హత్య

6 Feb, 2021 09:08 IST|Sakshi

మహిళ సహా నలుగురి అరెస్టు

కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన సీపీ

సాక్షి, వరంగల్‌: ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన సంఘటనలో సుబేదారి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను కమిషనరేట్‌లో సీపీ ప్రమోద్‌కుమార్‌ శుక్రవారం వెల్లడించారు.

అదృశ్యంపై కేసు నమోదు
గత నెల 24న వడ్డెపల్లి ప్రాంతానికి చెందిన తాళ్లపల్లి అనిల్‌ కనిపించడం లేదని ఆయన భార్య పూజిత సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గత నెల 29న అనిల్‌ మృతదేహం రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో లభ్యమైంది. అయితే, అనిల్‌ బంధువులు భార్య పూజితపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసుపై దృష్టి సారించిన పోలీసులు చేపట్టిన విచారణలో పూజితతో పాటు పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ డానీ, హన్మకొండ సతీష్, జులైవాడకు చెందిన కొట్టి సుధామణిలు అనిల్‌ను హత్య చేసినట్లు  తేల్చారు. 

వివాహేతర సంబంధమే కారణం..
వరుసకు తమ్ముడైన హన్మకొండ డానీ వద్ద మృతు డు అనిల్‌ 2018లో రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. వాటిని వసూలు చేసుకునే క్రమంలో డానీకి పూజిత తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి డానీ అక్క సుధామణి ఇంట్లో ఇరువురు తరచు కలుసుకునే వారు. 

అనుమానంతో హత్యకు ప్రణాళిక
కారణం లేకుండా భర్త గొడవపడడంతో అక్రమ సంబంధంపై అనుమానం రావొచ్చని భావించిన పూజిత.. అనిల్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ మేరకు తన భర్తను హతమార్చాలని డానీకి సూచించింది. జనవరి 22న అనిల్‌ హైదరాబాద్‌కు వెళ్లగా విషయాన్ని డానీకి చెప్పింది. దీంతో అతడిని హతమార్చేందుకు డానీ తమ్ముడైన సతీష్‌ సహకారం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫాతిమా జంక్షన్‌లో బస్సు దిగి వడ్డెపల్లి చర్చి వద్దకు చేరుకున్న అనిల్‌ను నిందితులు కారులో పెగడపల్లి డబ్బాలు, వంగపహాడ్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు కు తీసుకెళ్లారు.

అక్కడే మృతుడితో కలిసి మద్యం తాగి రాత్రి 10.30 కు భీమారం మీదుగా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ కెనాల్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ అనిల్‌ను తీవ్రంగా కొట్టి.. ఆయన చొక్కాతోనే గొంతుకు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కెనాల్‌లో వేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తన భర్త కనిపించడం లేదంటూ పూజిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కాగా, కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ ప్రమోద్‌కుమార్‌ అభినందించారు.ఈ సమావేశంలో డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్, ఎస్సైలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు