అత్తింటి వేధింపులు: యువకుడి ఆత్మహత్య

22 Sep, 2020 11:45 IST|Sakshi
దేవేందర్‌ (ఫైల్‌)

సాక్షి, సంగెం: అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువకుడు మనస్తాపం చెంది పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ ఆటోనగర్‌ తుమ్మలకుంటకు చెందిన పిండి దేవేందర్‌ (25)కు సంగెం మండలం కోట వెంకటాపూర్‌కు చెందిన న్యాల అనూష అలియాస్‌ లావణ్యతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంత కాలం నుంచి అత్తగారి తరఫున గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన అత్త న్యాల రాజమ్మ, బావమరిది అనిల్, భార్య అనూష వారి బంధువులు న్యాల బుచ్చయ్య, రవి, ప్రసాద్‌లు చెట్టుకు కట్టేసి దేవేందర్‌ను బూతులు తిట్టుతూ కొట్టారు.

అప్పటి నుంచి మనస్తాపం చెందిన దేవేందర్‌ 16వ తేదీన పిల్లలను చూసి వస్తానని అత్తగారింటికి వెళ్లాడు. అత్తింటి వారు  పిల్లలను చూపించకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చావని అవమానపరిచారు. దీంతో మనస్తాపం చెందిన దేవేందర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని తల్లికి ఫోన్‌ చేశాడు. వెంటనే వచ్చి 108లో ఎంజీఎంకు తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి పిండి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు