మృతదేహం వెంటే మృత్యు ఒడికి.. 2 గంటల వ్యవధిలో భార్యభర్తల మృతి

17 Jul, 2023 20:30 IST|Sakshi
రోదిస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్న పిల్లలు, కుటుంబీకులు

సాక్షి, మంచిర్యాల: కడవరకూ తోడుంటానని పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని దేవుడు నిజం చేయాలనుకున్నాడో ఏమో.. పిల్లలు చిన్నవారన్న దయ కూడా చూపలేదు. భార్య చనిపోయిందని పుట్టెడు దుఃఖంలో ఆమె మృతదేహం వెంటే స్వగ్రామానికి బయల్దేరాడు భర్త. తెల్లవారితే పిల్లలకు అమ్మ ఏదంటే ఏమని సమాధానం చెప్పాలని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. తనలోని బాధ పిల్లలకు కనిపించకూడదన్న ఆలోచనలో ఉన్నాడు. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. భార్య చనిపోయిన రెండు గంటల వ్యవధిలోనే లారీ రూపంలో అతడిని కబళించింది. ఈ విషా ద సంఘటన లక్సెట్టిపేట మండలంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మరణంతో పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో మండలంలోని ఎల్లారం గ్రామంలో విషాదం అలుముకుంది.

చిచ్చుపెట్టిన పొరుగింటి గొడవ..
డ్రైవర్‌గా పనిచేసే భర్త, బంగారం లాంటి ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో పొరుగింటి వారితో జరిగిన గొడవ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. చివరకు దంపతులిద్దరి మరణానికి కారణమైంది. లక్సెట్టిపేట ఎస్సై లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన శరణ్య(28) గృహిణి. ఆమె భర్త మల్లికార్జున్‌(33) ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఓంకార్‌, ఇవాంక సంతానం. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉండే రజినితో శరణ్యకు గొడవ జరిగింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పారు. ఇంతలో మరో మహిళ రాణి గొడవలో జోక్యం చేసుకుంది. రజినిని రెచ్చగొట్టి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శరణ్యపై ఫిర్యాదు చేయించింది.

మనస్తాపంతో పురుగుల మందు తాగి..
ఈ విషయం తెలిసిన శరణ్య మనస్తాపం చెందింది. చేయని తప్పుకు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని మదన పడింది. క్షణికావేశంలో ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్య శనివారం రాత్రి 11 గంటలకు మృతిచెందింది. కోలుకుని ఇంటికి వస్తుందనుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లడంతో మల్లికార్జున్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. అనంతరం తేరుకుని మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు బంధువు సాయంతో అంబులెన్స్‌ ఏర్పాటు చేశాడు.
అంబులెన్స్‌ వెనకాలే.. ద్విచక్రవాహనంపై..
అమ్మ త్వరలోనే ఇంటికి వస్తుందని రాత్రి పడుకునే ముందే పిల్లలకు చెప్పాడు మల్లికార్జున్‌. ఇంతలో శరణ్య మరణించడంతో తెల్లవారి పిల్లలకు ఏం చెప్పాలని దుఃఖాన్ని దిగమింగుతూ తన ద్విచక్రవాహనంపై బంధువుతో కలిసి అంబులెన్స్‌ వెనకాలే గ్రామానికి బయల్దేరాడు. పిల్లలు రేపటి నుంచి ఎవరిని అమ్మ అని పిలుస్తారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో లక్సెట్టిపేటలోని ఎన్టీఆర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. మూత్రవిసర్జన కోసం అక్కడ ఆగారు. ద్విచక్రవాహనం రోడ్డు పక్కన నిలిపారు. మల్లికార్జున్‌ రోడ్డు దాటుతుండగా రాయపట్నం నుంచి లక్సెట్టిపేట వైపునకు వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న బంధువు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

రెండు గంటల వ్యవధిలో  ఇద్దరు మృతి..
రెండు గంటల వ్యవధిలో భార్య శరణ్య, భర్త మల్లికార్జున్‌ మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి మరణంతో పిల్లల గురించి ఆలోచిస్తూ వెళ్లిన తాను కూడా పిల్లలను చూడకుండానే దుర్మరణం చెందడంతో బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇద్దరికీ లక్సెట్టిపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లారు. అమ్మా, నాన్న ఇద్దరినీ విగత జీవులుగా చూసిన పిల్లలు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు