తాగి తందనాలు.. భార్య హోటల్‌లో పనిచేస్తుండటంతో

31 Mar, 2021 10:14 IST|Sakshi

యాచారం: కడవరకు కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటానని పెళ్లినాట బాస చేసి అతడు మృగంగా మారి కిరాతకుడిగా ప్రవర్తించాడు. నిత్యం మద్యం తాగుతూ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆమె నిద్రిస్తుండగా గొడ్డలితో నరికేసి చంపేశాడు. అనంతరం గ్రామ సమీపంలోని పొదల్లో నిద్రించాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాలో జరిగింది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. తండాకు చెందిన రమావత్‌ శ్రీను, లలిత(40) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ఓ కుమార్తెకు వివాహమైంది.

మరో కూతురు, కొడుకు నగరంలో ఉంటున్నారు. ఆటో డ్రైవర్‌ అయిన శ్రీను నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో లలిత యాచారంలోని ఓ హాటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండేది. శ్రీను తన భార్యపై కొన్నిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరుచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన లలితతో మరోమారు ఘర్షణకు దిగాడు. రాత్రి పొద్దుపోయే వరకు దంపతుల మధ్య గొడవ జరిగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు సాధారణమేనని భావించారు.    

తెల్లారేసరికి రక్తం మడుగులో.... 
శ్రీను ఎలాగైనా తన భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఘర్షణ అనంతరం భార్య లలిత నిద్రకు ఉపక్రమించింది. దీంతో పథకం ప్రకారం శ్రీను ఆమెపై గొడ్డలితో శరీరంపై పలు చోట్ల దారుణంగా నరికేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఉదయమే నిద్రలేచే లలిత అలికిడి కనిపించకపోవడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. సీఐ లింగయ్య, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్యను చంపిన శ్రీను గ్రామ సమీపంలోని చెట్లపొదల్లో నిద్రిస్తుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు పట్టించినట్లు సమాచారం. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: వివాహేతర సంబంధం: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు