సాక్షి,ధర్మపురి( జగిత్యాల): భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కమలాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం, మృతుడి తండ్రి రాజలింగు ఫిర్యాదు మేరకు.. గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్(30)కు రోజాతో తొమ్మిదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్లకొడుకు అవినాశ్ ఉన్నాడు. ఇద్దరూ కూలీపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొద్దిరోజులుగా దంపతుల మధ్య ఏదో ఓ కారణంపై గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం కూడా రోజా భర్తతో గొడవపడడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ అర్ధరాత్రి గ్రామంలోని కుమ్మరి శంకరయ్య వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బుధవారం జాలర్లసాయంతో బయటకు తీసి పోస్టుమార్టంకోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కోడలి వేధింపుల కారణంగానే తన కొడుకు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి గోలి రాజలింగు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.