కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి..

30 Sep, 2022 06:55 IST|Sakshi
నిందితులు అక్షయ్, స్నేహ, రోహిణి

యశవంతపుర (బెంగళూరు): కుటుంబ విలువలకు సమాధి కడుతూ ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. ఇందులో కూతుర్ని కూడా భాగస్వామిని చేసింది. సినిమాలో మాదిరిగా భర్తను హత్య చేసిన భార్య, కూతురితో పాటు ప్రియున్ని బెళగావి పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీసీపీ రవీంద్ర గడాది వివరాలను వెల్లడించారు. బెళగావికి చెందిన సుధీర్‌ దుబాయ్‌లో వ్యాపారం చేసేవారు. ఆయన భార్య రోహిణి, కూతురు స్నేహ బెళగావిలో నివాసం ఉంటున్నారు. కరోనా కాలంలో సుధీర్‌ బెళగావికే వచ్చేశాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకొందనే అనుమానంతో సుధీర్‌ గొడవపడేవాడు. దుబాయ్‌లో వ్యాపారంలో సంపాదించిన డబ్బులను అతడు భార్య, కూతురికి ఇవ్వకుండా ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసేవాడు.  

నిద్రిస్తుండగా దాడి   
ఈ నెల 17న రాత్రి సుధీర్‌ భోజనం చేసి ఇంట్రో నిద్రిస్తున్నాడు. ప్లాన్‌ ప్రకారం రోహిణి, ఆమె ప్రియుడు అక్షయ్, కూతురు స్నేహ కలిసి మారణాయుధాలతో అతన్ని హత్య చేశారు. తెల్లవారుజామున ఎవరో చంపేశారని తల్లీకూతురు విలపించసాగారు. పోలీసులు విచారణలో.. సుధీర్‌ దేహంపై గాయాలు, చేయి విరగడం వంటివి చూసి తల్లీ కూతుళ్లతో పాటు ఎవరో పురుషుడు కూడా ఈ హత్యలో పాల్గొని ఉంటాడని అనుమానించారు.  

అనుమానంతో విచారణ  
భార్య, కూతురి మాటలపై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు నిందితుడు అక్షయ్‌ని కూడా పోలీసులు విచారించారు. దృశ్యం సినిమాలో మాదిరి తమకు ఏమీ తెలియదని రకరకాల అసత్య ఆధారాలను చూపించారు. కానీ చివరకు నిజం కక్కించారు. స్నేహ ప్రియుడు అక్షయ్‌ బెళగావికి చెందినవాడు కాగా, పుణెలో ఉంటున్నాడు. అతనికి పెళ్లయి, కూతురు ఉంది. భర్తని అడ్డు తొలగించుకోవడానికి రోహిణి, ఆమె కూతురు కలిసి అక్షయ్‌తో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు