నా భార్య మరో వ్యక్తితో కళ్లెదుటే తిరుగుతుంటే జీర్ణించుకోలేక

20 Jan, 2023 08:02 IST|Sakshi

(అనంతపురం) రాప్తాడురూరల్‌: ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు.. వారి ప్రేమకు గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో సర్దుకుపోలేక విడాకులు తీసుకున్నాడు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని  జీర్ణించుకోలేక కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరుకు చెందిన  తపాల్‌ బాబా బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల క్రితం గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం తన పేరును ఆషాబీగా ఆమె మార్చుకుంది. ఇద్దరూ కురుగుంట         వైఎస్సార్‌ కాలనీలో ఉండేవారు. వీరికి నూర్‌ మహమ్మద్‌ వలి అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు 15 సంవత్సరాలు.  

అధికారికంగా తలాక్‌ 
కొన్నేళ్ల పాటు ఆషాబీ, బాబా జీవనం సాఫీగా సాగింది. అనంతరం బాబా శైలిలో మార్పు వచ్చింది. మద్యానికి బానిసయ్యాడు. తాగుడు అలవాటు మానేయాలని తరచూ భార్య చెబుతుండడంతో ఆమెతో ఘర్షణ పడేవాడు. బంధుమిత్రులు చెప్పినా మార్పు రాలేదు. దీంతో రెండేళ్ల క్రితం మసీదులో మత పెద్దల సమక్షంలో అధికారికంగా విడాకులు (తలాక్‌) తీసుకున్నారు. ఆ సమయంలో తన 13 ఏళ్ల కుమారుడిని పెద్దల మాటకు కట్టుబడి భర్త వద్దనే ఆమె వదిలేసింది. ఈ క్రమంలో అప్పడప్పుడు తల్లి వద్దకు కుమారుడు వెళ్లి పలకరించి, తిరిగి తండ్రి వద్దకు చేరుకునేవాడు.   

మరొకరితో వివాహం  
తపాల్‌ బాబా నుంచి విడాకులు తీసుకున్నాక అక్కంపల్లికి చెందిన నబీరసూల్‌తో ఆషాబీకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే నబీరసూల్‌కు అప్పటికే వివాహమై భార్య కూడా ఉంది. ఆషాబీ రెండోభార్యగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల కురుగుంట జగనన్న కాలనీలో ఆషాబీకి ఇల్లు మంజూరు కావడంతో నబీరసూల్‌ దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించాడు. అనంతరం కొత్త ఇంట్లోనే వారు కాపురం ఉంటున్నారు.  

కళ్లెదుటే తిరుగుతుంటే జీర్ణించుకోలేక
మాజీ భార్య ఆషాబీ తన కళ్లెదుటే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా తిరుగుతుండడాన్ని చూసి తపాల్‌ బాబా జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆషాబీని హతమార్చేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి  కుమారుడు వలితో కలసి ఆషాబీ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆ సమయంలో ఆషాబీ సోదరుడు రమేష్‌ వాకిలి తీయగానే బాబా ఒక్కసారిగా కత్తితో కడుపులో పొడవడంతో పేగులు బయట పడి అతను కుప్పకూలిపోయాడు. వెనువెంటనే బెడ్‌రూంలోకి వెళ్లి ఆషాబీపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత కుమారుడితో కలసి పారిపోయాడు. అపస్మార స్థితిలో పడి ఉన్న రమేష్‌ ను స్థానికులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా రమేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అనంతపురం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, రూరల్‌ సీఐ విజయభాస్కరగౌడ్, ఎస్‌ఐ నబీరసూల్, సిబ్బంది కురుగుంట జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. ఘటనపై చుట్టుపక్కల వారిని, ఆషాబీ బంధువులను ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు