అనుమానం పెనుభూతమై..

30 Jul, 2022 11:28 IST|Sakshi

నల్గొండ (నకిరేకల్‌) : అనుమానం పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య మరొకరితో సఖ్యతగా మెలుగుతుందని అనుమానించిన భర్త ఆమెను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం అతడు పురుగుల మందు తాగాడు. నకిరేకల్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నకిరేకల్‌ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(29)కు ఇదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి(27)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూమార్తె ఉన్నారు.  శ్రీకాంత్‌ ప్లంబర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

నకిరేకల్‌లోని పన్నాలగూడెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏడాది కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత దంపతులు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీకాంత్‌  భార్య స్వాతి(27)ని  గదిలోనే దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఉదయం 9.30 గంటల సమయంలో నకిరేకల్‌లోనే ఉంటున్న స్వాతి అక్క పల్ల స్వప్నకు శ్రీకాంత్‌ ఫోన్‌ చేసి మీ చెల్లెను చంపేశానని సమాచారం ఇచ్చి అక్కడినుంచి పరారయ్యాడు. 

పురుగుల మందు తాగి..
భార్యను హత్య చేసిన తర్వాత ఇంటినుంచి బయటికి వెళ్లిన శ్రీకాంత్‌ పురుగుల మందు తాగాడు. అనంతరం తానే స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అతడిని నల్లగొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. హత్య స్థలాన్ని నకిరేకల్‌ సీఐ వెంకటయ్య పరిశీలించారు. స్వాతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతురాలి సోదరి స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటయ్య తెలిపారు. 
 

మరిన్ని వార్తలు