పెళ్లయిన వారానికే భార్యతో పురుగుల మందు తాగించిన భర్త

22 Jun, 2021 10:36 IST|Sakshi

సాక్షి,  వేల్పూరు(నిజామాబాద్‌): పెళ్లయి పది రోజులు కూడా కాలేదు.. మనం కలిసి జీవించడం సాధ్యం కాదని, కలిసి చనిపోదామంటూ ఓ భర్త పురుగుల మందు తాగి, తన భార్యతో తాగించాడు. వేల్పూరు మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరో యువతితో సంబంధం ఉండడం వల్లే తనతో కలిసి ఉండలేనని ఇలా చేశాడంటూ భార్య తెలిపింది!  పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన గంధం గంగాధర్, మల్లక్క దంపతుల రెండో కుమారుడు భీమయ్యకు, మాక్లూర్‌ మండలం మానిక్‌బండార్‌ గ్రామానికి చెందిన కొండపల్లి స్వాతితో ఈ నెల 13న వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.

అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో..మనం బతకలేమని, అందుకే కలిసి చనిపోదామని చెప్పి భీమయ్య తాను పురుగుల మందు తాగి, భార్యకు తాగించాడు. వెంటనే బయటకు వచ్చిన స్వాతి పురుగుల మందు తాగిన విషయన్ని అత్తామామలకు చెప్పింది. దీంతో అదే రాత్రి హుటాహుటిన ఇద్దరిని ఆర్మూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరించారు. ఈ విషయం తెలిసి స్వాతి తరపు బంధువులు సోమవారం ఉదయం ఆర్మూర్‌లోని ఆస్పత్రికి చేరుకొని బీమయ్య కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. తమ కూతుర్ని చంపేస్తారా? అంటూ నిలదీశారు.

ఈ గొడవచూసి సదరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు తాము వైద్యం చేయలేమని, భీమయ్య, స్వాతిని తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో దంపతులను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారని, 24 గంటలు గడిస్తే తప్పవారి ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేల్పూరు ఎస్సై రాజభరత్‌ రెడ్డి తెలిపారు. భీమయ్యకు మరో యువతితో సంబంధం ఉందని, అందుకే మనం కలిసి ఉండలేమని తనతో పురుగుల మందుతాగించాడని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వాతి తెలిపింది. 

చదవండి: తమ్ముడి ఇంట్లో శుభకార్యం.. అన్న ఇంట్లో విషాదం

మరిన్ని వార్తలు