ముందే వేసుకొన్న పథకం.. భార్యను పెన్నా నదిలో తోసేసిన భర్త

6 Dec, 2021 21:31 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు : కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను పెన్నా నదిలోకి తోసేసిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లెకు చెందిన ప్రసాద్‌ ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన తన అక్క రామాంజనమ్మ కుమార్తె రాధిక (19)ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. ఇటీవల భార్య మీద భర్తకు అనుమానం మొదలైంది. దీనికితోడు రాధిక తనకు ఆరోగ్యం బాగుండటం లేదని ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి వెళ్లి అక్కడ ఓ స్వామితో అంత్రాలు వేయించుకొని వచ్చేది.

ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీ రాధిక భర్తకు చెప్పకుండా తాళ్లమాపురం గ్రామానికి వెళ్లింది.  అయితే అదే గ్రామంలో ఉన్న ప్రసాద్‌ మరో అక్క అక్ష్మీదేవి తాళ్లమాపురానికి నీ భార్య వచ్చిందని తమ్మునికి సమాచారం చేరవేసింది. దీంతో ప్రసాద్‌ తన తమ్ముడు నవీన్‌ను వెంట పెట్టుకుని అదే రోజు తాళ్లమాపురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యను పిలుచుకుని జమ్మలమడుగుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే భార్య రాధిక, భర్త ప్రసాద్‌ మధ్య వాగ్వాదం జరిగింది. భార్యపై ప్రసాద్‌ చేయిచేసుకోవడంతో ఆమె కింద పడింది.

అన్నదమ్ములు ఇద్దరు ముందే వేసుకొన్న పథకం ప్రకారం పెన్నానదిపై నుంచి ఆమెను నీటిలోకి తోసేశారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రాధిక నదిలో కొట్టుకుని పోయింది. నాలుగు రోజులైనా కూతురు కనిపించకపోవడంతో అల్లుడు ప్రసాద్, నవీన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ గత నెల 28వ తేదీ జమ్మలమడుగు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రాధిక తల్లి రామాంజనమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్త ప్రసాద్, అతని తమ్ముడు నవీన్‌ను విచారించగా తామే పెన్నానదిలో తోసేశామని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు