ప్రేమించి పెళ్లి చేసుకొని.. కుందూ నదిలో తోశాడు..

22 Sep, 2020 07:38 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామలక్ష్మి

కుందూ నదిలోకి తోసిన భర్త 

ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం 

ఆమెను కాపాడిన రైతులు 

హత్యాయత్నం కేసు నమోదు 

సాక్షి, కర్నూలు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం పాటు బాగానే చూసుకున్నాడు. తర్వాత మనస్పర్ధలు రావడంతో భార్యను కుందూ నదిలోకి తోసి కడతేర్చేందుకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం కోవెలకుంట్ల  మండలం  గుళ్లదూర్తి సమీపంలో చోటుచేసుకుంది. కోవెలకుంట్ల ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన లక్ష్మినరసయ్య, పుల్లమ్మ కుమారుడు పత్తి భాస్కర్‌  హైదరాబాదులోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే నగరంలో రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుని 2016వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరి సంసారం కొన్ని నెలల పాటు సజావుగా సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భార్యను వదిలించుకోవాలని భాస్కర్‌ పథకం రచించాడు.

ఇందులో భాగంగా  ఈ నెల 16న భార్యను తీసుకుని స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళదామంటూ ఆమెను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు. గ్రామ సమీపంలోని కుందూనది వంతెనపైకి చేరుకున్న తర్వాత బైక్‌ ఆపాడు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నాటకమాడి భార్యను ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు తను కూడా బైక్‌తో సహా నదిలోకి దూకాడు. అతనికి ఈత రావడంతో కొంతదూరం తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో  రామలక్ష్మి కేకలు వేస్తూ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. (హైవేపై డ్రాగర్‌ చూపుతూ యువతి హల్‌చల్‌)

గమనించిన రైతులు నదిలోకి దూకి ఆమెను రక్షించారు. తర్వాత చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పీహెచ్‌సీకి చేరుకుని వివరాలు ఆరా తీయగా కసాయి భర్త భాగోతం బయటపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్‌పై  హత్యాయత్నంతో పాటు  498ఏ, 201 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు