నిందితుడు ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌ యజమాని పుత్రరత్నం

27 Jul, 2021 18:22 IST|Sakshi

పురుషులు మహిళలను ఇంకా ఆట వస్తువుగానే భావిస్తున్నారు. ఆమెను అడ్డంగా పెట్టుకుని అప్పనంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు వికృత రూపాలకు దారి తీస్తోంది. డబ్బుపై ఆశతో అబలను పాడు వృత్తిలోకి దింపుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను ఆ వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నించాడు. భార్య నిద్రిస్తుండగా ఆమెను వీడియో కాల్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశాడు. ఆమె శరీరంపై వికృత చేష్టలు చేస్తూ అవతలి వారికి వీడియో కాల్‌ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. అలా చేసిన వ్యక్తి ఓ వైద్యుడు. పైగా ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌ యజమాని పుత్రరత్నం.

ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ ఫిజియోథెరపిస్టు 2014లో ఓ యువతి (28)ని వివాహం చేసుకున్నాడు. అతడు ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌ యజమాని కుమారుడు. వీరికి ఏడేళ్లయినా ఇంతవరకు సంతానం కలగలేదు. దీంతో అత్తింటి వారు వేధించడం మొదలుపెట్టారు. అయితే భర్తకు అశ్లీల వీడియోలు చూడడం బాగా అలవాటు. వాటికి బానిసగా మారాడు. ఇక పిల్లలు పుట్టడం లేదుగా నువ్వు పోర్న్‌ స్టార్‌ అయితే డబ్బులు బాగా సంపాదించొచ్చు అని భార్యకు చెప్పాడు. ఆ వృత్తిలోకి దింపేందుకు ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నాడు.

అయితే భార్య ససేమిరా అటోంది. దీనిపై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త ఇలా అయితే కాదని జూన్‌ నెలలో ఒకరోజు భార్య నిద్రిస్తుండగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేశాడు. ఓ వ్యక్తికి తన భార్యను చూపించేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె నిద్రిస్తుండగా ప్రైవేటు పార్ట్స్‌లో వికృత చేష్టలు చేస్తూ అవతలి వ్యక్తికి లైవ్‌లో చూపిస్తున్నాడు. వెంటనే తేరుకున్న ఆమె భర్త చేసిన పనికి హతాశయురాలైంది.

ఈ విషయం అత్తామామలకు చెప్పగా వారు కుమారుడిని వెనకేసుకొచ్చారు. ఆమె పుట్టింటికి చేరింది. మతాచారం ప్రకారం విడాకులు తీసుకో అని అత్తింటి వారు చెప్పగా ఆమె తిరస్కరించింది. ‘భారతదేశంలో ఉన్నాం.. చట్టపరంగా విడాకులు తీసుకుంటా’ అని ప్రకటించి పోలీసులను ఆశ్రయించింది. ముంబైలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి గజనాన్‌ కబ్‌డులే తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతడు వినియోగించిన ఫోన్‌ను సీజ్‌ చేశాం’ అని వివరించారు.

మరిన్ని వార్తలు