పొదల్లోకి ఈడ్చుకెళ్లి.. బండరాయితో

4 Mar, 2021 03:54 IST|Sakshi

భార్యపై భర్త హత్యాయత్నం.. అడ్డుకున్న స్థానికులు

ఖమ్మం రూరల్‌: భార్యతో మాటామాటా పెరిగి.. కోపోద్రిక్తుడైన భర్త ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి హతమార్చబోయాడు. ఇదిచూసిన స్థానికులు రాళ్లతో అతడిపై దాడిచేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఖమ్మం రూరల్‌ మండలం టీఎన్‌జీవోస్‌ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుక్కోయలపాడుకు చెందిన జోగి నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంకు చెందిన నవ్య భార్యాభర్తలు. నాగేశ్వరరావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మనస్పర్థలు మరింత పెరగడంతో.. నవ్య టీఎన్‌జీవోస్‌ కాలనీలో తన పిల్లలతో విడిగా ఉంటోంది.

తనను ఒంటరిని చేసి జల్సాలు చేస్తోందని భావించిన నాగేశ్వరరావు ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఉన్న పిల్లలను తీసుకురావడానికి వరంగల్‌ క్రాస్‌రోడ్‌ నుంచి బయలుదేరి వెళ్తుండగా టీఎన్‌జీవోస్‌ కాలనీ సమీపంలో నవ్య కనిపించింది. దీంతో నాగేశ్వరరావు ఆమెతో ఘర్షణపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన నాగేశ్వరరావు ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లాడు. నవ్య తలపై బండరాయితో బలంగా మోదాడు. గమనించిన స్థానికులు నాగేశ్వరరావుపై రాళ్లురువ్వడం ద్వారా హత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ బాణాల రాము.. బాధితురాలిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. నాగేశ్వరరావును ఠాణాకు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు