వ్యసనాలకు డబ్బివ్వలేదని ఇల్లాలినే హతమార్చాడు! 

8 Feb, 2023 20:03 IST|Sakshi

గుత్తి(అనంతపురం జిల్లా): గుత్తిలో దారుణం చోటు చేసుకుంది. తన వ్యసనాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బును పుట్టింటి నుంచి తీసుకురాలేదన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే హతమార్చాడు ఓ దుర్మార్గుడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న మారుతీ నగర్‌కు చెందిన ఖాజా, జుబేదాబీ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఏడాది లోపు వయసున్న ఓ కుమారుడు ఉన్నాడు.

కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఖాజా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం కొనుగోలుకు అవసరమైన డబ్బును పుట్టింటికెళ్లి తీసుకురావాలని భార్యను వేధించేవాడు. అయితే కొద్దిగా కొద్దిగా కాకుండా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బును భార్య పుట్టింటి నుంచి తీసుకువచ్చేలా పథకం వేశాడు. ఇందులో భాగంగా తాను కారు కొనుగోలు చేస్తున్నానని, ఇందుకు రూ.2 లక్షలు ఇప్పించుకుని రావాలని భార్యకు పురమాయించాడు.

ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు జుబేదాబీ వివరించింది. అల్లుడి తాగుడు అలవాటు గురించి తెలిసిన అత్తమామలు తొలుత రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బు త్వరలో సమకూరుస్తామని భరోసానిచ్చారు. అయితే తాను అడిగిన మొత్తం తీసుకురాలేదన్న అక్కసుతో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో జుబేదాబీతో గొడవ పడ్డాడు. తల్లిని తండ్రి కొడుతుండడంతో నిద్ర మేల్కోన్న కుమార్తెలు సోమియా తవేరా, అలియా భయంతో ఏడుస్తూ తల్లిని గట్టిగా హత్తుకున్నారు.

పిల్లలు చూస్తుండగానే జుబేదాబీని ఖాజా గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేశాడు. మంగళవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అల్లుడి ఇంటి వద్దకు చేరుకుని చూడగా విగత జీవిగా ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించారు. అప్పటికే తల్లి కోసం ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లిన చిన్నారులను స్థానికులు చేరదీశారు.
చదవండి: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య

సమాచారం అందుకున్న సీఐ వెంకట్రామిరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తమ కుమార్తెను అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ జుబేదాబీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో జుబేదాబీని భర్త ఖాజానే హతమార్చినట్లు వెల్లడైంది. ఖాజాపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు.    

మరిన్ని వార్తలు