ట్యాంక్‌బండ్‌పై కలకలం: ఒకే రోజు ఐదుగురు మహిళలు

13 Aug, 2021 22:42 IST|Sakshi

వివిధ సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఆత్మహత్యకు యత్నం

అప్రమత్తమై వెంటనే వారిని కాపాడిన లేక్‌ పోలీసులు

కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పగింత

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ సందర్శకులను ఆకర్షిస్తుండగా ఇప్పుడు బలవన్మరణాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా ఒకేరోజు ఐదుగురు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న లేక్ పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. భర్త వేధింపులు తాళలేక డిప్రెషన్‌తో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. మరో మహిళ ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి ప్రయత్నించగా, ప్రేమ విఫలమైందని ఓ యువతి సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించింది. ఇక మద్యానికి బానిసైన ఓ మహిళ కుటుంబ సమస్యలతో కూడా బాధపడుతుండడంతో హుస్సేన్‌సాగర్‌లో దూకింది. 

ఆత్మహత్యలు నివారించేందుకు అక్కడే గస్తీ కాస్తున్న లేక్ పోలీసులు వారిని వెంటనే కాపాడారు. గజ ఈతగాళ్ల సాయంతో సాగర్‌లో వారిని గాలించి బయటకు తీసుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని లేక్‌ పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం హైదరాబాద్‌లో కలకలం రేపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు