వీళ్లు మహా కి‘లేడీ’లు..‘డబుల్‌’ ఇళ్లతో దండుకున్నారు..

15 Jul, 2021 07:51 IST|Sakshi

పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు    

సాక్షి, సనత్‌నగర్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ మహిళను సనత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెతో పాటు ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించిన మరో మహిళను ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్‌– 3లో నివాసం ఉండే మహిళా సంత సొసైటీకి చెందిన సోషల్‌ వర్కర్‌ సుప్రియ, అల్లాకే బందే ఫౌండేషన్‌ అధ్యక్షురాలు అయేషా తబస్సుంలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు.

అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని కూడా అందినకాడికి దండుకున్నారు. వీరి వలలో పడి డబ్బులు కట్టినవారిలో సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్లాపూర్‌నకు చెందిన పలువురు మహిళలు ఉన్నారు. మూడు నెలలైనా ఇళ్ల విషయం తేలకపోవడంతో సుప్రియపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె పలుమార్లు మీటింగ్‌ ఏర్పాటు చేసి తన భర్త రాఘవను ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసి నమ్మించింది. ఇంకొన్నిసార్లు  ఇళ్లు వచ్చేశాయంటూ తాళం చెవులు, విద్యుత్‌ మీటర్‌ నంబర్లను చూపించి నమ్మించి వారి నుంచి మరిన్ని డబ్బులు వసూలు చేస్తుండేది.

ఇదే రకం వ్యవహరంలోనే అయేషా తబస్సును ఇటీవల జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితులు.. సుప్రియ కూడా తమను మోసం చేసిందని గ్రహించి సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. వీరి వలలో చిక్కుకుని డబ్బులు చెల్లించిన నలుగురు బాధిత మహిళలు ముందుకువచ్చారు. మొత్తం 950 మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఏ1 గా అయేషా తబస్సుం, ఏ2 గా సుప్రియలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు