నిలోఫ‌ర్ డైట్ మాజీ కాంట్రాక్ట‌ర్ సురేశ్ బాబు అరెస్ట్

6 Jul, 2021 08:36 IST|Sakshi

నిలోఫర్‌ డైట్‌ మాజీ కాంట్రాక్టర్‌ అరెస్టు

 కటకటాల్లోకి పంపిన సీసీఎస్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రి డైట్‌ మాజీ కాంట్రాక్టర్‌ కోడూరి సురేష్‌ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్‌ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. మియాపూర్‌నకు చెందిన సురేష్‌బాబు 2017 ఏప్రిల్‌ 1న నిలోఫర్‌ ఆస్పత్రి డైట్‌ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత.

2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్‌ బాబు గోల్‌మాల్‌కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సురేష్‌ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్‌ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్‌ బాబు హై ప్రొటీన్‌ డైట్‌ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్‌ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్‌ బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు