Hyderabad Crime: యువతికి వేధింపులు.. పోకిరీని వాహనంతో సహా ఫోటో తీసి..

27 May, 2022 14:24 IST|Sakshi
భువనేశ్వర్‌, మణికంఠ, భరత్‌  

సాక్షి, హైదరాబాద్‌: బాధితురాళ్ల భయమే పోకిరీలకు అవకాశంగా మారుతోంది. ఫిర్యాదు చేయడానికి, ఆధారాలు అందించడానికి అనేక మంది వెనుకడుగు వేయడంతోనే పదేపదే వేధింపుల బారినపడుతున్నారు. నగరానికి చెందిన ఓ యువతి తనను వేధించిన పోకిరీని అతడి వాహనంతో సహా ఫొటో తీయడమే కాకుండా షీ–టీమ్స్‌ మెట్లు ఎక్కింది. వాహనం నంబర్‌ ఆధారంగా అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం గురువారం అతడికి ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఓ మహిళ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో పని చేస్తోంది. ఆమె విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వెంట పడటంతో పాటు అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.

రెండుసార్లు ఇలా చేయడంతో పాటు ఈ నెల 16న బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని లక్ష్మీనర్సింహ్మ స్వామి దేవాలయం వద్దా ఆమెను వేధించాడు. దీంతో ధైర్యం చేసిన బాధితురాలు పోకిరీతో పాటు అతడి వాహనాన్నీ ఫొటో తీసింది. షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసి తన వద్ద ఉన్న ఫొటోను చూపించింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ ఫొటోలో ఉన్న వాహనం నంబర్‌ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో అతడు బంజారాహిల్స్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి జి.నగేష్‌గా తేలింది.

వెయిట్‌ లాస్‌ టెక్నిక్స్‌ పేరుతో ఆమెతో పరిచయం పెంచుకుని, స్నేహం చేయడానికి ప్రయత్నించాడని విచారణ లో తేలింది. నగేష్‌ను షీ–టీమ్స్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు అదన పు సీపీ (నేరాలు) ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రతి బాధితురాలు ఇలా ధైర్యం చేసి ముందుకు వస్తే పోకిరీలకు చెక్‌ పడుతుందని, ఫలితంగా వారితో పాటు మరికొందరూ వీరి బారినపడకుండా ఉంటారని అధికారులు చెప్తున్నారు. 
చదవండి: చక్రబంధంలో లింగంపల్లి.. చౌరస్తా మొత్తానికి ఒకే ఒక్కడు

మరో ముగ్గురికీ జైలు శిక్ష 
బన్సీలాల్‌పేట్‌: మద్యం మత్తులో మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన, స్థానికంగా న్యూసెన్స్‌ చేసిన మరో ముగ్గురికి గురువారం జైలు శిక్ష పడింది. వీరిలో ఒకరికి 112 రోజుల జైలు విధించడం గమనార్హం. భోలక్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మణికంఠ, భువనేశ్వర్‌ మద్యం మత్తులో ఆటోలో వెళ్తున్న మహిళలను వేధిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు నగర్‌ వాసి భరత్‌ ఎలియాస్‌ భల్లుపై రౌడీషీట్‌ ఉంది.

ఇతగాడు స్థానికంగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద ఎప్పుడు పడితే అప్పుడు మద్యం మత్తులో హంగామా చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇతగాడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ముగ్గురినీ పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. వీరిపై దాఖలు చేసిన చార్జ్‌షీట్లు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం భరత్‌కు 112 రోజులు, మణికంఠకు 37 రోజులు, భువనేశ్వర్‌కు 19 రోజుల జైలు శిక్ష విధించింది.  

మరిన్ని వార్తలు