ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్‌మార్క్‌ గుర్తుతో కోట్లు దండుకున్నాడు

2 Oct, 2021 09:16 IST|Sakshi

రూ. కోట్లల్లో టోకరా

నిందితుడిపై కేసు నమోదు  

సాక్షి, అమీర్‌పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్‌ వేయించి, హాల్‌మార్క్‌ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు.

ఇదే తరహాలో బోరబండ, రహమత్‌నగర్‌ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్‌రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 
చదవండి: ఆర్‌ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం 

మరిన్ని వార్తలు