విషాదం నింపిన పుట్టిన రోజు వేడుక.. ఆలస్యంగా వెలుగులోకి.. 

26 Sep, 2022 09:19 IST|Sakshi
మృతుడు నితిన్‌   

సాక్షి, హైదరాబాద్‌: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఉత్సాహంగా జరుపుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నై ప్రాంతంలోని ఐఐటీలో ఉన్నత చదువు చదువుకునేందుకు వెళ్లి పుట్టిన రోజు నాడే తనువు చాలించడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌద్ధనగర్‌కు చెందిన గంజి ఉమాపతి, భాగ్యలక్ష్మి దంపమతులకు కుమారుడు నితిన్‌ (21), ఒక కుమార్తె ఉన్నారు.

కుమారుడు నితిన్‌ దార్వాడిలోని ఐఐటీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 23న శుక్రవారం నితిన్‌ పుట్టిన రోజు కావడంతో మహాబలిపురంలో సముద్ర స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లారు. సముద్రస్నానం చేస్తుండగా నితిన్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సముద్రం లోపలికి వెళ్లగా బలమైన అలలు రావడంతో సముద్రం లోపలికి కొట్టుకుని పోయారు. ఇద్దరు స్నేహితులు ఎలాగో బయటపడగా నితిన్‌ మాత్రం శవమై బయటకు వచ్చాడు. స్థానిక పోలీసులు వచ్చి మృతదేహాన్ని శంగర్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం ఉదయం బౌద్ధనగర్‌కు తీసుకుని వచ్చారు.  

కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు.. 
చెట్టంత కొడుకు త్వరలోనే ప్రయోజకుడై వస్తాడని ఎదురు చూస్తుండగా శవమై ఇంటికి రావడంతో వారి బాధ వర్ణనాతీతం. మధ్యాహ్నం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ సికింద్రాబాద్‌ నియోజకవర్గ నాయకులు రవిప్రసాద్‌గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నరేందర్, దేవదాసు, భాస్కర్, నవీన్, శ్రీకాంత్‌లు మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
చదవండి: ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి 

మరిన్ని వార్తలు