పెళ్లైన మరునాడే.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

25 Nov, 2021 09:08 IST|Sakshi
బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు, ఇన్‌సెట్లో నూతన వరుడు

రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి 

కీసర ఓఆర్‌ఆర్‌ వద్ద ముగ్గురు,

సాగర్‌ హైవే సర్వీస్‌ రోడ్డులో ఇద్దరు బలి

బెంగళూరు సమీపంలో నగరానికి చెందిన నవదంపతులు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బుధవారం ఏడుగురు మృత్యువాతపడ్డారు. కీసర ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా.. సాగర్‌ హైవే సర్వీస్‌ రోడ్డులో ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని బోర్‌వెల్‌ వాహనం ఢీకొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శేరిలింగంపల్లి నేతాజీనగర్‌కు చెందిన నవదంపతులు బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. 

పెళ్లైన మరునాడే..
సాక్షి, చందానగర్‌: నగరానికి చెందిన నవదంపతులు పెళ్లి అయిన మరునాడే రోడ్డు ప్రమాదానికి గురై విగతజీవులుగా మారారు. శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని నేతాజీనగర్‌లో నివసించే పార్శి మురళీకృష్ణ, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు(38) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అతనికి చెన్నైకి చెందిన కనిమొళి(33)తో తిరుపతిలో ఆదివారం వివాహమైంది. సోమవారంరాత్రి 8.30 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఐ 10 వాహనంలో నవదంపతులతోపాటు ఇద్దరు బంధువులు చెన్నైకి ప్రయాణమయ్యారు.
చదవండి: క్రిప్టో కరెన్సీ’ చేతికి రాలేదని.. ‘స్వాతీ.. పిల్లలు జాగ్రత్త.. అర్థం చేసుకో’

బెంగళూరు నుంచి 120 కి.మీ. దూరంలో రాత్రి 12 గంటల సమయంలో కారును నడుపుతున్న శ్రీనివాసులు ఆగివున్న లారీని ఢీకొట్టడంతోఅతను అక్కడికక్కడే మృతి చెందాడు. కోమాలోకి వెళ్లిన కనిమొళి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వారితో ప్రయాణిస్తున్న నవవధువు సోదరి, శ్రీనివాసులు కోడలు తీవ్ర గాయాలపాలయ్యా రు. శ్రీనివాసులు మృతదేహాన్ని బుధవారం ఉద యం నేతాజీనగర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొని... 
సాక్షి, కీసర: పేట్‌ బషీరాబాద్‌లోని శ్రీని అవెన్యూ గేట్‌–3లో నివసించే సుమంత్‌రెడ్డి (20) తన సోదరుడిని ఖమ్మంలోని నీట్‌ కోచింగ్‌ సెంటర్‌ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు అల్వాల్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(21), డ్రైవర్‌ శంకర్‌రెడ్డి(39)తో కలసి కారులో బుధవారం తెల్లవారుఝామున బయలుదేరారు. తిరుగుప్రయాణంలో ఉదయం 11.30 గంటల సమయంలో కీసర ఓఆర్‌ఆర్‌ ప్లాజాకు రెండు కిలోమీటర్ల దూరంలో కారు బ్రేక్‌డౌన్‌ అయింది. డ్రైవింగ్‌ చేస్తున్న సుమంత్‌రెడ్డి కారును అకస్మాత్తుగా ఎడమ వైపునకు మళ్లించగా, అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో సుమంత్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, పవన్‌కుమార్‌రెడ్డి (21)కి తీవ్రగాయాలయ్యాయి. కీసర పోలీసులు వచ్చి పవన్‌కుమార్‌రెడ్డిని ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో పది నిమిషాలలోపు శామీర్‌పేట జంక్షన్‌ వద్ద రోడ్డు దిగి అల్వాల్‌కు చేరుకునే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. 

చదవండి: బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం..యువతి మృతి 


సాగర్‌ రహదారి సర్వీస్‌ రోడ్డుపై ప్రమాదానికి కారణమైన బోర్‌వెల్‌ వాహనం

బోర్‌వెల్‌ లారీ ఢీకొని.. 
హస్తినాపురం: బోర్‌వెల్‌ వాహనం ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన విశాల్‌(21), నగరంలోని హబ్సిగూడకు చెందిన రోహిత్‌రెడ్డి (21), గౌతంరెడ్డిలు బీఎన్‌రెడ్డి నగర్‌లో నివసిస్తూ ఇబ్రహీంపట్నం సమీపంలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ వదిలిన వెంటనే వీరు స్కూటీపై నగరానికి బయలుదేరారు. సాగర్‌ రహదారి సమీపంలోని సర్వీస్‌ రోడ్డుపై సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద స్కూటీని, వెనుక నుంచి వేగంగా వచ్చిన బోర్‌వెల్‌ లారీ ఢీకొట్టడంతో విశాల్, రోహిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గౌతంరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

మరిన్ని వార్తలు