ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి..

22 May, 2021 13:26 IST|Sakshi

 ఐదుగురు ఉగాండా మహిళల అరెస్ట్‌

సాక్షి, చైతన్యపురి: ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగాండా వాసులు అయిదుగురిని రాచకొండ యాంటి హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగం, చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన మేరకు.. లొకాంటో యాప్‌ ద్వారా యువతుల చిత్రాలు పోస్ట్‌ చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి వారి ఆటకట్టించాలని పోలీసులు నిర్ణయించారు.

డెకాయ్‌ బృందంలోని సభ్యుడు కస్టమర్‌గా యాప్‌లోని ఫోన్‌కు కాల్‌ చేసిన సాలి మిల్లి అలియాస్‌ నాగబాలా షేక్‌ అలియాస్‌ షీలాను సంప్రదించాడు. ముగ్గురు యువతులు ఉన్నారని చెప్పడంతో దిల్‌సుఖ్‌నగర్‌ రాజధాని థియేటర్‌ వద్దకు రావాలని లోకేషన్‌ షేర్‌ చేశాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఇద్దరు నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులు రావడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

వారి వద్ద  నిషేధిత నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ (మత్తుమందు) కలిగి ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి అయిదు సెల్‌ఫోన్‌లు, రూ.5500 నగదు, 5గ్రాముల కెటామైన్‌ డ్రగ్, 17 గ్రాముల గుర్తుతెలియని మత్తుమందు  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరంతా విజిటింగ్‌ వీసాపై ఇండియాకు వచ్చి చట్టవిరుద్ధంగా ఇక్కడే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. టోలిచౌకిలో వీరు నివాసముంటున్నారు.

చదవండి: జూబ్లీహిల్స్‌: ఓయో రూమ్‌లో వ్యభిచారం..

మరిన్ని వార్తలు