తీన్మార్‌ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్‌ అంబర్‌పేట శంకర్‌ 

6 Sep, 2021 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ రౌడీషీటర్‌ అంబర్‌పేట శంకర్‌ పేరు సుదీర్ఘ కాలం తర్వాత తెరపైకి వచ్చింది. క్యూ న్యూస్‌ ఛానల్‌ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో ఇతడి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆదివారం శంకర్‌ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్‌ మల్లన్నను పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన విషయం విదితమే.

ఏప్రిల్‌ 19న తనకు వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ చేసిన తీన్మార్‌ మల్లన్న  రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడని లక్ష్మీకాంత్‌ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు–శర్మకు మధ్య సెటిల్‌మెంట్‌ చేయడానికి అంబర్‌పేట శంకర్‌ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టారు. దీంతో ఆదివారం శంకర్‌ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్యా రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అని, అయితే తాను అందులో విఫలమయ్యానని శంకర్‌ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు అతడి నుంచి చిలకలగూడ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
చదవండి: ట్యాంక్‌బండ్‌పై సండే సందడి 
నేటినుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో సేవలు 

మరిన్ని వార్తలు