చనిపోయిన భర్త అకౌంట్‌ నుంచి రూ.34 లక్షలు మాయం

6 Jul, 2021 12:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హిమాయత్‌నగర్‌: ఇటీవల కోవిడ్‌తో చనిపోయిన తన భర్త అకౌంట్‌ నుంచి డబ్బులు మాయమైనట్లు మెహదీపట్నంకు చెందిన నజియా సోమవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చనిపోయిన సమయంలో భర్త ఫోన్, వాలెట్‌ కనిపించలేదని, అదే సమయంలో హాస్పిటల్‌కు ఖర్చు బెట్టిన డబ్బులను లెక్క చూసేందుకు బ్యాంకు స్టేట్‌మెంట్‌ నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని చూస్తుండగా.. భర్త అకౌంట్‌లో నుంచి రూ.34లక్షల నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు స్పష్టమైంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నజియా పోలీసులను ఆశ్రయించింది.

లాటరీ పేరుతో రూ.2లక్షలు.. 
మీకు ఖరీదైన కారు బహుమతిగా వచ్చిందంటూ వట్టపల్లికి చెందిన అజారుద్దీన్‌కు స్నాప్‌డీల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఇందుకు గాను మీరు రూ.2లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు. దీంతో ఖరీదైన కారు ఉచితంగా వస్తున్నప్పుడు రూ.2లక్షలు పెద్ద విషయం కాదంటూ అతడు చెప్పిన బ్యాంకు ఖాతా లకు బదిలీ చేశాడు. రోజులు గడుస్తున్నా కారు ఇవ్వకపోగా.. ఫోన్‌లో స్పందన లేకపోవడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

ఫ్రెండే కదా అని రూ.2లక్షలు పంపాడు.. 
యూఎస్‌లో ఉంటున్న రమేష్‌ అనే స్నేహితుడి నుంచి బంజారాహిల్స్‌కు చెందిన సురేష్‌బాబుకు మెసేజ్‌ వచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్నాను ఈ మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్‌కు రూ.2లక్షలు పంపమన్నాడు. స్నేహితుడే కదా అని ఏ మాత్రం క్రాస్‌చెక్‌ చేసుకోకుండా అడిగిన రూ.2లక్షలను సురేష్‌బాబు ఆ బ్యాంకు ఖాతాలకు పంపడం జరిగింది. ఆ తర్వాత రమేష్‌న ఫోన్‌లో అడగ్గా.. నేనేమీ నిన్ను అడగలేదని, నువ్వు ఎవరికి పంపావో నాకు తెలీదనే సమాధానం ఇచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించి సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు