ఫోన్‌లో బుకింగ్‌.. ర్యాపిడోపై డెలివరీ.. మూడోసారి దొరికిన మురుగేశన్‌

18 May, 2022 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కుషాయిగూడ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నేరగాళ్లు లెక్కచేయడం లేదు. ఏకంగా ఫోన్‌లో గంజాయి ఆర్డర్‌ తీసుకొని.. ఎంచక్కా ర్యాపిడో బైక్‌ బుకింగ్‌ చేసుకొని ఇంటికెళ్లి మరీ సరుకు డెలివరీ చేస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రాచకొండ పోలీసులకు చిక్కిన మురుగేశన్‌ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. తాజాగా మూడోసారి మల్కాజిగిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులకు చిక్కాడు. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మురుగేశన్‌ కాప్రాలోని శంకరమ్మ కాలనీలో స్థిరపడ్డాడు. ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

అవసరాలకు డబ్బులు సరిపడకపోవడంతో అతడు గంజాయి రవాణాను ఎంచుకున్నాడు. ధూల్‌పేటలోని పెడ్లర్‌ మహేశ్‌ నుంచి కిలోల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి 10, 15 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా చేసేవాడు. ప్యాకెట్‌ రూ.400 చొప్పున పేదలు, విద్యార్థులకు విక్రయించేవాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం మురుగేషన్‌ను అరెస్ట్‌ చేశారు. మహేశ్‌ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 1.7 కిలోల గంజాయి (114 ప్యాకెట్లు; ఒక్కో ప్యాకెట్‌ 15 గ్రాములు), రోలింగ్‌ పేపర్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు