రెండో పెళ్లి.. అడిగింది ఇవ్వకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని

19 Mar, 2022 10:02 IST|Sakshi
డాక్టర్‌ స్వప్న (ఫైల్‌)

కట్నం వేధింపులతో వైద్యురాలి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

సాక్షి, మలక్‌పేట: భర్త వేధింపులు తాళలేక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన గంగనపల్లి కాశీవిశ్వనాథం కుమార్తె స్వప్న(38)ఎంబీబీఎస్‌ చదివింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పీహెచ్‌సీలో వైద్యురాలిగా పని చేస్తున్న సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లైంది.  అనివార్య కారణాల వల్ల భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2015 ఏప్రిల్‌లో కర్నూలుకు చెందిన ముత్యాల మద్దయ్య కుమారుడు శ్రీధర్‌తో రెండో వివాహం జరిగింది.

రూ.10 లక్షలు నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ముట్టజెప్పారు. శ్రీధర్‌ కూడా డాక్టర్‌. అతడికి మేనమామ కుమార్తెతో పెళ్లికాగా, విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో పీజీ సీటు రావడంతో హైదరాబాద్‌కు వచ్చింది.  «శ్రీధర్‌ నల్లగొండ మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తలు అస్మాన్‌ఘడ్‌ తిరుమల హిల్స్‌లో ఉంటున్నారు. ఏడాది పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అదనపు కట్నం తేవాలని, లేదంటే మొదటి భార్యను తీసుకొస్తానని భర్త వేధిస్తుండంతో స్వప్న మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా యత్నించింది. 
చదవండి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో..

2020 సంవత్సరంలో స్వప్న తల్లి విజయ మృతి చెందగా అప్పటి నుంచి ఆమెకు చెందిన ఇంట్లో వాటా, ఆమె పేరిట ఉన్న నగదు తీసుకురావాలని స్వప్నను శ్రీధర్‌ ఒత్తిడి చేస్తున్నాడని తండ్రి విశ్వనాథం ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఇదిలా ఉండగా,  ఈనెల 8న స్వప్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తండ్రికి శ్రీధర్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబసభ్యులు స్వప్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిరాలి తండ్రి సైదాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, స్వప్న ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్రీధర్‌పై కట్నం వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. 

మరిన్ని వార్తలు