బాధితులే నిందితులుగా..! 

26 Oct, 2022 01:39 IST|Sakshi
వీవోఐపీ కాల్స్‌కోసం ప్రత్యేకంగా రూపొందించిన యంత్రాన్ని స్వాధీనం చేసుకుని మీడియాకు చూపుతున్న అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తదితరులు 

గేమింగ్, ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్స్‌ వెనుక చైనీయులు 

ఫిలిప్పీన్స్‌ కేంద్రంగా కేటుగాళ్లు దందా 

ఐదుగురు నిందితులు అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్‌ దర్యాప్తులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్‌ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్‌లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.

వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్‌ విన్‌తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్‌తో కూడిన గేమ్‌లను అనేక యాప్‌లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్‌ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి.

నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్‌లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్‌ యాప్‌ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్‌లోని అలెన్‌కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్‌లో ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్‌ యోతో సంబంధాలున్నా యి.

బాధితుల చిట్టా అందుకున్న అలెన్‌.. దాన్ని చుచున్‌కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్‌ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్‌ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు, లింకై ఉన్న ఫోన్‌ నంబర్‌ సిమ్‌ కార్డు ముంబైలో ఉన్న చుచున్‌కు చేరతాయి. అతను వాటిని అలెన్‌కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్‌ల ద్వారా సంప్రదించే అలెన్‌ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్‌ ఇస్తున్నాడు.  

నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు..  
హైదరాబాద్‌కు చెందిన నాగప్రసాద్‌ గేమింగ్‌ యాప్‌లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్‌ ద్వారా అలెన్‌ వల్లో పడి ముంబైలో ఉన్న చున్‌ ద్వారా తన బ్యాంక్‌ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్‌ అనే బాధి తు డు తన బావమరిది అనిల్‌ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్‌ తన స్నేహితుడైన శ్రీనివాస్‌ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్‌ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్‌.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు.

చున్‌ విచారణ, అతడి ఫోన్‌ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్‌ను అరెస్టు చేశారు. చుక్‌తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్‌ ఖాతాదారులు సయ్యద్‌ సుల్తాన్, మిర్జా నదీమ్‌ బేగ్, పర్వేజ్‌ పట్టుబడిన విషయం తెలిసిందే.  దుబాయ్‌లో ఉంటున్న ఇమ్రాన్‌ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

తర్వాత ఇమ్రాన్‌ దుబాయ్‌ నుంచి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్‌ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్‌తో అలెన్‌ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు