వివాదాల్లో ‘ఖాకీ’

25 Apr, 2022 02:49 IST|Sakshi

ఖమ్మం జిల్లాలో జరిగిన రెండు ఘటనల్లో ఆరోపణలు 

రామాయంపేట ఘటనలో సీఐపైనా కేసు నమోదు

హత్య కేసు ఆరోపణలో ఏసీపీ సస్పెండ్‌.. పబ్‌ కేసులో సీఐపై వేటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. పోలీసు అధికారులు నేతల ఒత్తిళ్లకు లొంగిపోవడం, సహకరించడం వల్ల జనం ఇబ్బందిపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా ఒకటి వెనుక మరొకటిగా జరుగుతున్న ఘటనల్లో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఖమ్మంలో రెండు వివాదాల్లో.. 
ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన 2 విషాద ఘటనల్లో అధికార పార్టీతోపాటు పోలీస్‌ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు వనమా రాఘవేందర్‌రావు వేధింపులతో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో సంచలనం రేపింది. రాఘవేందర్‌రావుపై వివాదాస్పద కేసులు నమోదైనా స్థానిక పోలీసు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతోనే పరిస్థితి చేయిజారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

చివరికి రాఘవేందర్‌రావును నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. ఇక తాజాగా బీజేపీ కార్యకర్త గణేశ్‌ ఆత్మహత్య పెద్దచిచ్చునే రాజేసింది. తనపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని బాధితుడు మరణానికి ముందు చెప్పిన వీడియో హైకోర్టుకు చేరింది. పోలీసులతోపాటు మంత్రి పువ్వాడ అజయ్‌ వేధింపుల వల్లే గణేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.  

అగ్గి రగిల్చిన రామాయంపేట ఘటన 
రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్, మరికొందరి వేధింపులు భరించలేక స్థానికుడు సంతోష్‌ తన తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడటం కూడా కలకలం రేపింది. ఈ ఘటనలోనూ అధికార పార్టీ నేతల తీరు, వారికి పోలీసుల సహకారంపై వివా దం రేకెత్తింది. బాధితుడిని అక్కడి మాజీ సీఐ నాగార్జునగౌడ్‌ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీం తో సీఐపైనా కేసు నమోదైంది. సీఐ పరారీలో ఉన్న ట్టు పోలీసులు చెప్పడం వివాదస్పదమవుతోంది. 

హత్య కేసులో ఏసీపీ.. పబ్‌ కేసులో సీఐ 
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలోనూ కొందరు పోలీస్‌ అధికారుల తీరు వివాదాస్పదమైంది. నెలన్నర కింద రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన రియల్టర్ల జంట హత్య ఘటనలో ఏసీపీ బాలకృష్ణారెడ్డిపై సస్పెన్షన్‌ వేటుపడింది. హంతకుడితో ఏసీపీ అంటకాగినట్టు ఆరోపణలొచ్చాయి. పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో బంజారాహిల్స్‌ సీఐ శివచంద్ర సస్పెండయ్యారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని నార్సింగి సీఐ గంగాధర్, ఎస్సై లక్ష్మణ్‌ భూవివాదాల్లో జోక్యం చేసుకున్నట్టు తేలడంతో సస్పెండ్‌ అయ్యారు. 

‘సిఫార్సు’పోస్టింగ్‌ల వల్లే? 
పోలీసు శాఖలో మంచి చోట్ల పోస్టింగ్‌ పొందాలంటే నేతల సిఫార్సులు తప్పనిసరి అనే ప్రచారముంది. ఎస్సై నుంచి ఏఎస్పీ దాకా ప్రజాప్రతినిధు లు సిఫార్సు లేఖలు ఇస్తేనే పోస్టింగ్‌లు వచ్చే పరిస్థితి ఏర్పడిందని డిపార్ట్‌మెంట్‌లో చర్చ జరుగుతోంది. దీంతో నేతలు, వారి కుటుంబీకులు, అనుచరుల విషయాల్లో పోలీసు అధికారులు చూసీ చూడనట్టు ఉంటున్నారని అంటున్నారు.   

మరిన్ని వార్తలు