Hyderabad: ఆటో డ్రైవర్‌ నకిలీ పోలీస్‌గా మారి.. అత్యాచార, చోరీ కేసులున్నాయంటూ 

6 Jun, 2022 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నకిలీ పోలీస్‌ అవతారమెత్తిన ఓ ఆటో డ్రైవర్‌ సీనియర్‌ వృద్ధులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ పాత నేరస్తుడుని ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు అరెస్టు చేసి  16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 11.000 నగదు, సెల్‌ పోన్‌ ఒక కత్తిని స్వాధీనం చేసుకుని  ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు తెలిపిన  మేరకు..నల్గొండ జిల్లా దేవత్‌పల్లి తండాకు చెందిన రమావత్‌ నరేష్‌(30) రామంతపూర్‌లో నివాసం ఉంటూ  ఆటో నడుపుతుంటాడు. డబ్బు సరిపోక పోవడంతో నేరాల బాట పట్టాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా అతనిలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో గత నెల 28 చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీనియర్‌ సిటిజన్‌ను తన ఆటోలో ఎక్కించుకుని.. నేను చైతన్యపురి పోలీస్‌ అధికారి అని  చెప్పి.. నువ్వు బంగారు గొలుసు దొంగిలించావని బెదిరించాడు.అలా అతని వద్ద ఉన్న బంగారు ఉంగరం, రూ. 20 వేల నగదు దోచుకొని వెళ్లాడు. గత నెల 30న ఎల్‌బీనగర్‌ లోని విజయవాడ బస్టాప్‌లో నిలబడిన వ్యక్తిని బెదిరించి రూ. 1500 నగదు దోచుకుని  పారిపోయాడు. ఈ నెల 1న నాగోలు చౌరస్తాలో ఓ సీనియర్‌ సిటిజన్‌ (62) వ్యక్తి వద్దకు వెళ్లి ఎస్‌ఐగా  బెదిరించి ఆటోలో ఎక్కించున్నాడు. బంగారు ఉంగరాన్ని దోచుకుని పరారయ్యాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు దర్యాపు చేపట్టి శనివారం ఎల్‌బీనగర్‌ రింగ్‌ రోడ్డులో అనుమానాస్పద తిరుగుతుండగా రమావత్‌ నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీలకు పాల్పడినట్లు ఓప్పుకున్నాడు. అతని వద్ద నుండి రూ.80 వేల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  
చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి..

మరిన్ని వార్తలు