సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి..

30 Nov, 2021 06:51 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

సాక్షి,లంగర్‌హౌస్‌ (హైదరాబాద్‌): నగరానికి మందుల కోసం వచ్చిన ఓ యువకుడిని దారిదోపిడీ దొంగలు చితకబాది కత్తితో బెదిరించి లూటీ చేశారు. అతని వద్ద నుంచి రూ. 3 వేల నగదు, రూ.20 వేల ఖరీదు చేసే సెల్‌ఫోన్‌ ఆటో డ్రైవర్, మరో ఇద్దరు కలిసి లాక్కెళ్లారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. కోదాడకు చెందిన నాగరాజు తల్లి అనారోగ్యంతో భాదపడుతుంది. ఆమెకు మందులు కొనడానికి ఆదివారం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి ఎల్‌బీ నగర్‌ వద్ద కోదాడ బస్సు దిగి మెట్రో రైలులో లకిడికాపూల్‌కు చేరుకొని అక్కడి నుండి బస్సులో మెహిదిపట్నం చేరుకున్నాడు.

మెహిదీపట్నం నుండి షేక్‌పేట్‌ వెళ్లడానికి ఆటో ఎక్కగా అందులో అప్పటికే ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. నానల్‌నగర్‌ వద్దకు రాగానే అటోను లంగర్‌హౌస్‌ వైపునకు మళ్లించారు. అనుమానం వచ్చిన నాగరాజు అటో నేరుగా టోలీచౌకి మీదుగా వెళ్లాలి కదా ఇటు వైపు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. వెంటనే ఆటో డ్రైవర్‌తో పాటు, అందులో ఉన్న ఇద్దరు ఆ నాగరాజుపై దాడి చేశారు. బాపూఘాట్‌ సమీపంలోకి తీసుకువచ్చి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అయితే పోలీసులకు మాత్రం మరుసటి రోజు సాయంత్రం భాదితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసుల దార్యప్తు చేస్తున్నారు.

చదవండి: దారుణం: గతేడాది కోవిడ్‌తో చనిపోతే.. ఇప్పుడు మృతదేహాలు అప్పగింత! 

మరిన్ని వార్తలు