HYD: ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆటోడ్రైవర్‌ 

25 Nov, 2021 07:22 IST|Sakshi

శభాష్‌ జాహిద్‌ 

అభినందించి, జ్ఞాపిక అందించిన నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: అబిడ్స్‌లోని జీపీఓ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ చిన్నారిపై అఘాయిత్యాన్ని ఆటోడ్రైవర్‌ జాహిద్‌ అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పందించారు. జాహిద్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించడంతో పాటు జ్ఞాపిక అందించారు. సీపీ చెప్పిన వివరాల ప్రకారం..  

► హఫీజ్‌పేటకు చెందిన ఓ మహిళ నిత్యం తన ఇద్దరు కుమార్తెలతో (ఆరేళ్లు, రెండేళ్లు) కలిసి ఎంఎంటీఎస్‌ రైలులో వచ్చి నాంపల్లి యూసిఫియాన్‌ దర్గా వద్ద భిక్షాటన చేసుకుని రాత్రికి తిరిగి వెళ్తూంటుంది. మంగళవారం కూడా ఇలాగే చేసిన మహిళ జీపీఓ వద్ద ఉండే తన సోదరుణ్ని కలవడానికి వెళ్లింది. అక్కడ ఆలస్యం కావడంతో వీళ్లు తిరిగి వెళ్లే రైలు సమయం దాటిపోయింది. దీంతో ఆ రాత్రికి తన సోదరుడితో కలిసి జీపీఓ వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రించింది. 
చదవండి: తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక 

►  బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అఫ్జల్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఛోటూ అటుగా వెళ్తూ వీళ్లని గమనించాడు. అంతా నిద్రలో ఉన్నారని తెలుసుకుని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. తన ఆటోను అక్కడే పార్క్‌ చేసి.. ప్రయాణికుల కోసం వేచి చూస్తున్న సయ్యద్‌ జాహిద్‌ ఈ విషయం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఛోటూను వారించడంతో పాటు నిద్రిస్తున్న చిన్నారి తల్లి, ఆమె సోదరుణ్ని లేపాడు.  

► వీరితో ఛోటూ వాగ్వాదానికి దిగగా... అటుగా వస్తున్న అబిడ్స్‌ ఠాణాకు చెందిన గస్తీ పోలీసులు గమనించారు. వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఛోటూపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు  చేశారు. బాధ్యతగా స్పందించిన జాహిద్‌ను కమిషనర్‌ తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు.  

మరిన్ని వార్తలు