బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడు దారుణ హత్య.. తల, మొండెం వేరు చేసి..

26 Feb, 2023 11:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఉస్మాన్ నగర్‌కు చెందిన మామా జఫర్ కుమారుడు ఫైజల్ ఈనెల 12న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి అతడి కోసం వెతికారు.

ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక లాభం లేదని ఫైజల్ తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 25న(శనివారం) రాత్రి ఒంటి గంట సమయంలో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. హంతకుడ్ని జబ్బార్(17)గా గుర్తించారు. మినర్ కాలనీకి చెందిన ఇతడు వృత్తిరీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడు.

అయితే ఫైజల్‌ను జబ్బార్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి తలను తీసుకెళ్లిపోయాడు. హత్య జరిగిన రెండు వారాల తార్వత దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  షాహిన్ నగర్లో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఫైజల్‌ మొండెం కన్పించింది. దుస్తుల ఆధారంగా అతడ్ని గుర్తుపట్టారు. తల ఇంకా లభించాల్సి ఉంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫైజల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జబ్బార్ ఫైసల్‌ను ఇంత కిరాతకంగా ఎందుకు హత్య చేశాడనే కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. ఫైజల్‌ను ఫిబ్రవరి 12నే కిడ్నాప్ చేసి, అదే రోజు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో..

మరిన్ని వార్తలు