సెంట్రల్‌ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

24 Aug, 2021 06:55 IST|Sakshi
మౌనిక(ఫైల్‌)

గచ్చిబౌలి : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రోజంతా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేష్, హెచ్‌సీయూ విద్యార్థులు తెలిపిన ప్రకారం..పెద్దపల్లి జిల్లా తారేపల్లికి చెందిన ఆర్‌.మౌనిక (27) హెచ్‌సీయూలో నానో సైన్స్‌ ఎంఎస్‌సీ రెండవ సంవత్సరం చదువుతోంది.

చదవండి: కార్వీ స్కామ్‌లో వెలుగులోకి కొత్త విషయాలు 

లేడీస్‌ హాస్టల్‌ ఎల్‌హెచ్‌–7లోని రూమ్‌ నెంబర్‌ 24లో ఉంటోంది. ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఆమె సోమవారం ఉదయం నుంచి డోర్‌ తెరవలేదు. స్నేహితులు ఫోన్‌ చేసినా స్పందించ లేదు. దీంతో తోటి విద్యార్థులు రాత్రి 7.55 గంటలకు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు డోర్‌ పగులగొట్టి చూడగా కిటికీకి ఉరివేసుకొని కన్పించింది.

చదవండి: మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ

వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేష్, ఎస్‌ఐలు శ్రీశైలం, వెంకట్‌రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు మౌనికకు ఫోన్‌ చేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని  చెప్పినట్లుగా తోటి విద్యార్థినుల ద్వారా తెలిసింది. కాగా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసి క్యాంపస్‌లోని వందలాది మంది హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను అదుపు చేసి మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: 8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం 

మరిన్ని వార్తలు