యూఎస్‌ కాన్సులేట్‌ కేసులో క్లారిటీ! 

17 Jul, 2021 15:11 IST|Sakshi

‘వీసా స్లాట్స్‌’పై యూఎస్‌ కాన్సులేట్‌ ఫిర్యాదు 

కేసు నమోదు చేసుకున్నసైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

ఏపీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న వైనం 

కాన్సులేట్‌ అధికారుల సమక్షంలో ఇరువురితో డెమో  

నోటీసులు జారీ చేసి పంపినదర్యాప్తు అధికారులు 

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో అమెరికా వీసా కోసం స్లాట్‌ బుక్‌ చేస్తున్న కొందరు తమ వెబ్‌సైట్‌ను యాక్సస్‌ చేస్తున్నట్లు అనుమానం ఉందంటూ యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు దర్యాప్తును సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాదాపు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలో బేగంపేటలోని అమెరికన్‌ కాన్సులేట్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మైఖేల్‌ పీ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని నమోదు చేశారు.

వివిధ రకాలైన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూఎస్‌ కాన్సులేట్‌ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ నిర్వహిస్తోంది. స్టూడెంట్‌ వీసా కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులు అప్పట్లో వేర్వేరుగా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ ఆన్‌లైన్‌ దరఖాస్తును తాము స్వయంగా పూర్తి చేయలేదని, వేరే వ్యక్తుల ద్వారా పని చేయించిన నేపథ్యంలోనే స్లాట్‌ దొరికిందంటూ చెప్పారు.

దీని నిమిత్తం తాము వారికి రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున చెల్లించామని కాన్సులేట్‌ అధికారులతో పేర్కొన్నారు. దీంతో తమ అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సస్‌ చేస్తున్న కొందరు వీసా స్లాట్స్‌ బుక్‌ చేస్తున్నారని, ఆ దరఖాస్తు నింపడానికి డబ్బు వసూలు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమంటూ మైఖేల్‌ పీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు.  

వీసా స్లాట్స్‌ బుకింగ్‌ వెనుక..  
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేజ, కృష్ణ జిల్లావాసి ప్రభాకర్‌లు ఇలా దరఖాస్తులు నింపినట్లు గుర్తించారు. వీరిద్దరినీ ఇటీవల అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీసా స్లాట్స్‌ బుకింగ్‌ వెనుక ఎలాంటి నేరం లేదని బయటపడింది. బీటెక్‌ పూర్తి చేసిన వీళ్లు గూగుల్‌ క్రోమ్‌లో అందుబాటులో ఉండే అలెర్ట్‌ వ్యవస్థను వాడుకున్నారు. వీసా స్లాట్స్‌ను విడుదల చేసిన యూఎస్‌ కాన్సులేట్‌ అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది.

దీన్ని క్రోమ్‌ ద్వారా గుర్తించే గూగుల్‌ వీరికి అలెర్ట్‌ ఇస్తోంది. ఆ సమయంలో తమ వద్ద ఉన్న దరఖాస్తుదారుల వివరాలతో ఆన్‌లైన్‌లో అప్‌లై చేస్తున్న వీరిద్దరూ స్లాట్స్‌ ఇప్పిస్తున్నారు. దీనికోసం కొంత రుసుము తీసుకుంటున్నారు. ఒక్కోసారి క్రోమ్‌ అలెర్ట్‌ కాని సందర్భాల్లో తాము రోజుకు 17 గంటలు కంప్యూటర్‌ ముందే, కాన్సలేట్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసుకుని గడుపుతామని వెల్లడించారు. కాన్సులేట్‌ అధికారులను సైతం సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు పిలిపించిన దర్యాప్తు అధికారులు ఈ క్రోమ్‌ అలెర్ట్‌ విధానంపై వీరిద్దరితో డెమో ఇప్పించారు.  

నేరమా? కాదా?  
ఈ నేపథ్యంలోనే ఇందులో ఎక్కడా తమ వెబ్‌సైట్‌ను యాక్సస్‌ చేయడం లేదని కాన్సులేట్‌ అధికారులకు స్పష్టమైంది. అయితే స్లాట్స్‌ ఇప్పించి, దరఖాస్తు పూర్తి చేస్తున్నందుకు రుసుము వసూలు చేయడంపై మాత్రం కాన్సులేట్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇలా చేయడం నేరమా? కాదా? అనే దానిపై స్పష్టత లేని నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తేజ, ప్రభాకర్‌లకు నోటీసులు ఇచ్చి పంపారు. ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి న్యాయ నిపుణుల అభిప్రాయానికి పంపాలని నిర్ణయించారు. వీరి నుంచి వచి్చన సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.  
 

మరిన్ని వార్తలు