ఇకపై ఇలాంటివి పోస్ట్‌.. షేర్‌ చేసినా నేరమే

23 Apr, 2021 08:23 IST|Sakshi

రాజధానిలో మొదలైన సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌ 

కర్ఫ్యూ, కరోనాపై సోషల్‌ మీడియాలో వదంతులు 

నిఘా కోసం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో స్పెషల్‌ టీమ్‌ 

పోస్టే కాదు షేర్‌ చేసినా బాధ్యులేనన్న పోలీసులు 

వారిపై కేసులు, అరెస్టులు తప్పవంటూ హెచ్చరిక   

సాక్షి, సిటీబ్యూరో: నైట్‌ కర్ఫ్యూ ప్రారంభమైన తొలి రోజు ‘పోలీసులు లాఠీలకు పని చెప్పారు.. వీపు చింతపండు చేస్తున్న పోలీసులు’ పేరుతో వార్తాంశం రూపొందించిన ఓ యూట్యూబ్‌ చానల్‌పై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ‌తదితర సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతున్న వదంతులను కనిపెట్టడానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిఘా వేసి ఉంచుతున్నారు. దీనికోసం ప్రత్యేక టీమ్స్‌తో సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌ ప్రారంభించారు.

ఈ టీమ్స్‌ షిఫ్టుల వారీగా నిర్విరామంగా పని చేసేలా ఏర్పాట్లు చేశారు. మరోపక్క డీజీపీ కార్యాలయంతో పాటు నిఘా వర్గాలు సైతం వదంతులపై కన్నేసి ఉంచుతున్నాయి. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్‌లో ఉండే గ్రూపులే వదంతులు విస్తరించడానికి కారణమవుతున్నాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక టూల్స్‌ వినియోగిస్తున్నారు. ఆయా వదంతులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా, లేదంటే సుమోటోగా కేసులు రిజిస్టర్‌ చేస్తున్నారు. 
చట్టపరమైన చర్యలు.. 
కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైన నాటి నుంచి వివిధ రకాల ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. వీటిలో కొన్ని సమాచారం పంచే విధంగా, ప్రజల్లో ముందు జాగ్రత్తలపై అవగాహన పెంచేలా ఉంటుండగా.. అత్యధికంగా భయపెట్టే సమాచారం, నిర్ధారణ కాని అంశాలు పొందుపరిచి ఉంటున్నాయి. వీటి వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యంలోనే మూడు కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ స్పేస్‌ పోలీసింగ్‌ చేపట్టారు. సోషల్‌ మీడియాలో అనుమానాస్పదంగా ఉన్న సమాచారాన్ని నిర్ధారించుకోవడానికీ ఈ టీమ్స్‌ పని చేస్తున్నాయి. ఇందులో భాగంగా వాటిని పోస్టు చేసిన వ్యక్తులను సంప్రదించి రూఢీ చేసుకుంటున్నారు. వదంతులను ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఫార్వర్డ్‌ చేసినా నేరమే.. 
వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాల్లో వదంతులు, అభ్యంతరకర అంశాలు షేర్‌ చేయడమే కాదు వాటిని ఫార్వర్డ్‌ చేయడమూ అంతే నేరం. ఈ రెండు చర్యలూ ఒకే తరహా నేరాల కిందికి వస్తాయి. ఇటీవల అనేక మంది కొన్ని అంశాలను గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేస్తున్నారు. దీంతో పాటే ఫార్వర్డెడ్‌ యాజ్‌ రిసీవ్డ్‌ అంటూ ఓ చిన్న సందేశం పెడుతున్నారు. ఆ సమాచారం అభ్యంతరకరమైనప్పుడు ఇలా చేసినా నేరమే అవుతుంది. ఏ అంశాన్నీ పూర్తిగా నిర్ధారించుకోకుండా షేర్, ఫార్వర్డ్‌ చేయొద్దు.
 – కె. బాలకృష్ణారెడ్డి, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ, సైబరాబాద్‌  

( చదవండి: వాటర్‌ బాటిల్‌ కొనలేదని మహిళపై వ్యాపారి దాడి )  

మరిన్ని వార్తలు