డేటింగ్‌ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు

5 Oct, 2022 10:59 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం వేట

సాక్షి, హైదరాబాద్‌: పద్మారావునగర్‌కు చెందిన ఓ వైద్యుడిని డేటింగ్‌ యాప్‌కు బానిసగా మార్చి, 2020 నుంచి మూడు విడతల్లో రూ.కోటికి పైగా కాజేసిన ముఠాలో ఓ నిందితుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని సంయుక్త సీపీ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల నుంచి వైద్య పట్టా పొందిన బాధితుడు కేంద్ర సర్వీసులో వైద్యుడిగా ఉన్నారు. ఈయన 2020లో జిగోలో ప్లేబాయ్‌ సర్వీసెస్‌ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ డేటింగ్‌ యాప్‌ నిర్వాహకులే కొందరు యువతులను నియమించుకున్నారు. బాధితులతో చాటింగ్, ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. నగరవాసి వారికి కాల్‌ చేయగా.. కొందరు మాట్లాడి కొన్ని ఫొటోలు పంపి వాటిలో ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధమన్నారు. దానికోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. అలా ఆ ఏడాది జూన్‌ 6 నుంచి ఈ వైద్యుడు ‘చెల్లింపులు’ మొదలెట్టారు.  

చదవండి: (‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’)

ఈ కథను వాట్సాప్‌లోకి మార్చిన నేరగాళ్లు ఆ యువతులే చాట్‌ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు సృష్టించారు. తమను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. వైద్యుడు నమ్మేయడంతో పలు దఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో కొంత రిఫండ్‌ అన్నారు. ఏ దశలో అయినా డబ్బు చెల్లించడం ఆపేస్తే ఏమాత్రం తిరిగి రాదంటూ బెదిరించారు. దీంతో బాధితుడు 2020 అక్టోబర్‌ వరకు రూ.41.5 లక్షలు, కొంత విరామం ఇచ్చినా 2021 మార్చి వరకు మరో రూ.30 లక్షలు చెల్లించేశాడు.

జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్‌ ఫండ్‌ లోన్లు తీసుకుని డబ్బు చెల్లించేశాడు. ఇలా మూడు దఫాలుగా మొత్తం రూ.1.53 కోట్లు వారికి పంపేశాడు. రెండుసార్లు కేసు నమోదైనా బాధితుడి ఒత్తిడితోనే మూతపడింది. చివరకు జూలైలో మరో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీకి చెందిన అరుణ్‌ ఖాతాలో రూ.30 లక్షలు పడినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న సూత్రధారులు మోహిత్, దీపక్, మంజిత్, నీతు, సోలంకి కోసం గాలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు