8 ఏళ్లు గడిచినా పగ చల్లారలేదు...అందుకే పథకం ప్రకారం

18 Apr, 2021 11:31 IST|Sakshi

సాక్షి, ముషీరాబాద్‌: తన భార్యను తీసుకెళ్లాడనే కక్ష్యతో సంవత్సరాల తరుబడి వేచి చూసి, చివరికి కొడుకునే రెక్కీకి పంపించి, ఆ తర్వాత కుమారుడు, మరో బంధువుతో కలిసి తనకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారు. నిందితులను చిక్కడపల్లి పోలీసులు పంజాబ్‌లో శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సూర్యనగర్‌లో ఒక ఫాస్ట్‌పుడ్‌ నిర్వాహకున్ని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. దీనిని చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. శనివారం చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఏళ్లు గడిచినా పగ చల్లారలేదు
పంజాబ్‌ రాష్ట్రానికి చెంది, హర్వేస్టర్‌ మిషన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న సర్వన్‌ సింగ్‌ (42) బల్జిత్‌ కౌర్‌ (32)ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకు సోదరుడు అయ్యే సత్‌నాం సింగ్‌కు వరుసకు వదిన అయ్యే బల్జిత్‌ కౌర్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడగా ఆమెతో కలిసి 8 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. వీరిద్దరు వివాహం చేసుకోగా వీరికి  ఒక బాబు జన్మించాడు. నారాయణగూడలో పంజాబ్‌ ఫుడ్‌హౌస్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తూ బాగ్‌ లింగంపల్లిలోని సూర్యనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అయితే తన భార్యను తీసుకెళ్లిన సత్‌నాం సింగ్‌పై సర్వన్‌సింగ్‌ 8 ఏళ్లు గడిచినా కక్ష్య చల్లారలేదు. అతన్ని చంపడానికి వేచి చూస్తున్నాడు. పైగా తన 15 ఏళ్ల కుమారుడికి సత్‌నాం సింగ్‌పై ద్వేషాన్ని నూరిపోశాడు. తన దగ్గరి బంధువుల ద్వారా సత్‌నాం సింగ్‌ ఆచూకీని తెలుసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలుసుకుని తన కుమారుడ్ని రెక్కీకి పంపించాడు. మార్చి 7, 2021లో హైదరాబాద్‌ వచ్చిన కుమారుడు తల్లి బల్జిత్‌ కౌర్‌ను కలిసి తనను పనికి కుదిర్చుకోవాలని కోరాడు. దీనితో పనితో పాటు తన నివాసంలో ఉండే విధంగా అవకాశం కల్పించింది. అయితే కుమారుడు పంజాబ్‌లో ఉన్న తండ్రి సర్వన్‌ సింగ్‌కు ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలను తెలుపుతున్నాడు. బల్జిత్‌ కౌర్‌ అఫ్జల్‌గంజ్‌లోని అశోక్‌ బజార్‌లో గల గురుద్వారాకు తరచూ వెళ్లి సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటు అక్కడే క్వార్టర్స్‌లో నిద్రపోయేది.

ఈ సమయంలో ఇంట్లో సత్‌నాం సింగ్‌ ఒంటరిగా ఉండేవాడు. ఈ విషయంపై పక్కా సమాచారంతో మార్చి 29న పంజాబ్‌ నుంచి మరో బంధువు హర్షదీప్‌సింగ్‌తో కలిసి సర్వన్‌సింగ్‌ సికింద్రాబాద్‌ మార్చి 31వ తేదీకి వచ్చారు. రాత్రి సికింద్రాబాద్‌లోనే బస చేసిన వారు ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు కుమారుడు వచ్చి కలిశాడు. వారిని తనతో పాటు సూర్యనగర్‌కు తీసుకెళ్లి సత్‌నాం సింగ్‌ ఇంటిని చూపించాడు. సమయం కోసం నారాయణ గూడ చౌరస్తాలో క్రౌన్‌ కేఫ్‌ హోటల్‌లో వేచిచూశారు. రాత్రి 11.30 గంటల తర్వాత ఫాస్ట్‌పుడ్‌ మూసివేసిన సత్‌నాం సింగ్‌  ఇంటికి వచ్చిన నిద్రపోయాడు. ఈ విషయాన్ని తన తండ్రికి సమాచారం అందించడంతో బంధువు, కుమారుతో కలిసి నిద్రపోతున్న సత్‌నాం సింగ్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సరిగ్గా గొంతు తెగక్కపోవడంతో ఇంట్లో కత్తితో కుమారుడు పూర్తిగా గొంతుకోసి సంఘటనా స్థలం నుంచి పంజాబ్‌కు వెళ్లిపోయారు. భార్య బల్జిత్‌ కౌర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి ఏసీసీ, శ్రీధర్, ఇన్‌స్పెక్టర్‌ శివ శంకర్‌రావు, అదనపు ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో పంజాబ్‌కు ప్రత్యేక టీంను పంపించి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐ ఆర్‌.కోటేశ్, కానిస్టేబుళ్లు పి.శ్రీకాంత్, సి.సందీప్, పి.రామాంజనేయ ప్రసాద్‌లను అభినందించి, రివార్డులను ప్రకటించారు.  

( చదవండి: నీళ్లకు డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు