పబ్‌ దగ్గర దింపేస్తామని తీసుకెళ్లి..

11 Jun, 2022 01:46 IST|Sakshi

రొమేనియా బాలికపై అఘాయిత్యం ఘటనలో కీలక అంశాలు వెల్లడి

నిందితుడు సాదుద్దీన్‌తో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు

బాలికను నమ్మించి బేకరీ వరకు తీసుకువచ్చామన్న సాదుద్దీన్‌

తిరిగి పబ్‌ వద్ద వదిలేస్తామంటూ ఇన్నోవాలో అత్యాచారం

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ కీలక విషయాలు బయటపెడుతున్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు గురువారం అతడితో క్రైమ్‌ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేశారు. అతడిని పబ్‌తోపాటు కాన్సూ బేకరీ, అత్యాచారం జరిగిన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 44లోని పవర్‌స్టేషన్‌ పరిసరాలకు తీసుకువెళ్లి అనేక అంశాలు రికార్డు చేశారు. సాదుద్దీన్‌ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలివీ..

ఒకరొకరుగా కలిసి..
గత నెల 28న మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాదుద్దీన్‌ తన స్నేహితుడైన పొరుగు జిల్లా కార్పొరేటర్‌ కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11లో ఉన్న టెండర్‌ కట్స్‌ దుకాణం వద్దకు వెళ్లాడు. అప్పటికే ఎమ్మెల్యే కుమారుడు, రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్‌కు చెందిన బాలుడు అక్కడ ఉన్నారు.

కొద్దిసేపటికి హైదర్‌గూడకు చెందిన మరో బాలుడు బెంజ్‌ కారులో అక్కడికి చేరుకున్నాడు. కార్పొరేటర్‌ కుమారుడు ద్విచక్ర వాహనాన్ని అక్కడే పెట్టేయగా.. అంతా కలిసి బెంజ్‌ కారులో అమ్నీషియా పబ్‌కు వెళ్లారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు అతడి ఇన్నోవా కారులో మరో స్నేహితుడితో కలిసి పబ్‌కు వచ్చాడు. పబ్‌లో దాదాపు 200 మంది ఉండగా.. వీరిలో 70 మంది వరకు బాలికలు, యువతులు ఉన్నారు.

పబ్‌లో పరిచయం చేసుకుని..
పబ్‌ మొదటి అంతస్తులో జరుగుతున్న ఈ పార్టీలో జ్యూస్‌ కౌంటర్‌ వద్ద ఉన్న రొమేనియా బాలికను తొలుత చింతల్‌మెట్‌కు చెందిన బాలుడు గుర్తించాడు. ఆమెను పరిచయం చేసుకుని డ్యాన్స్‌ ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. పక్కనే ఉన్న మరో బాలికను సాదుద్దీన్‌ పరిచయం చేసుకున్నాడు.

కాసేపటికి సాదుద్దీన్, ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు, కార్పొరేటర్‌ కుమారుడు, మిగతా ఇద్దరు మైనర్లు కలిసి.. ఆ బాలికల చుట్టూ చేరి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీనితో ఇబ్బందిపడిన బాలికలు సాయంత్రం 4.30 గంటల సమయంలో పబ్‌ నుంచి బయటికొచ్చారు. వారిని అనుసరిస్తూ సాదుద్దీన్‌ సహా ఆరుగురూ బయటకు వచ్చారు.

ఇంట్లో దింపేస్తామని చెప్పి..
ఓ బాలిక క్యాబ్‌లో వెళ్లిపోగా.. రొమేనియా బాలిక తిరిగి పబ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే చేతికి ఉన్న ట్యాగ్‌ను ఆమె తీసేయడంతో సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఇది గమనించిన సాదుద్దీన్‌ సహా ఆరుగురూ ఆమెను ఇంటివద్ద దింపుతామంటూ కారు ఎక్కించుకుందామని, అవకాశం చిక్కితే అఘాయిత్యానికి పాల్పడొచ్చని ప్లాన్‌ వేసుకున్నారు.

చింతల్‌మెట్‌ బాలుడు ఆమె వద్దకు వెళ్లి.. తమ బెంజ్‌ కారులో ఇంట్లో దింపుతామని నచ్చజెప్పాడు. ఆమె అంగీకరించడంతో కారులో ఎక్కించుకున్నారు. ఒక మైనర్‌ కారు డ్రైవింగ్‌ చేయగా పక్కన వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు కూర్చున్నాడు. వెనుక సీటులో ఎమ్మెల్యే కుమారుడు, చింతల్‌మెట్‌ బాలుడు, ఇద్దరి మధ్యలో రొమేనియా బాలిక కూర్చుంది.

సాదుద్దీన్, సైఫ్‌ అనే స్నేహితుడు, కార్పొరేటర్‌ కుమారుడు, మరో బాలుడు ఇన్నోవా కారులో బెంజ్‌ను అనుసరించారు. ఆ సమయంలో ఇన్నోవాను డ్రైవర్‌ జమీల్‌ నడిపాడు. కాన్సూ బేకరీ వద్దకు వెళ్లేటప్పుడే బాలికతో ఎమ్మెల్యే కుమారుడు, మిగతావారు అసభ్యంగా ప్రవర్తించారు. బేకరీ వద్ద ఆగాక ఈ విషయం సాదుద్దీన్‌కు తెలిసింది.

పబ్‌ వద్దకు వెళ్లాలనడంతో..
బేకరీ వద్దకు వెళ్లేప్పటికి రొమేనియా బాలికకు ఆమెను పబ్‌కు తీసుకువచ్చిన స్నేహితుడి నుంచి పదేపదే ఫోన్లు వచ్చాయి. సాదుద్దీన్, మిగతావారు ఆమెను ఫోన్‌ మాట్లాడనివ్వలేదు. చివరికి బాలిక తన స్నేహితుడి వద్దకు వెళతానని, పబ్‌ వద్ద డ్రాప్‌ చేయాలని కోరింది. దీన్ని అలుసుగా తీసుకున్న సాదుద్దీన్, మిగతావారు ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్‌ చేశారు.

హైదర్‌గూడ బాలుడు పథకం ప్రకారం బెంజ్‌ కారులో డీజిల్‌ లేదని చెప్పాడు. జమీల్, సైఫ్‌ బేకరీ వద్దే ఆగిపోగా.. బాలిక, మిగతావారు ఇన్నోవాలో ఎక్కారు. దానిని కార్పొరేటర్‌ కుమారుడు నడపగా.. పక్కన హైదర్‌గూడ బాలుడు కూర్చున్నాడు. మధ్య సీట్లలో ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు, వెనుక సీట్లలో చింతల్‌మెట్‌ బాలుడు, రొమేనియా బాలిక కూర్చున్నారు.

కొంతదూరం వెళ్లాక ఓ ఫోన్‌కాల్‌ రావడంతో ఎమ్మెల్యే కుమారుడు ఇన్నోవా దిగి వెళ్లిపోయాడు. మిగతావారు బాలికను తీసుకుని రోడ్‌ నంబర్‌ 44లోని పవర్‌స్టేషన్‌ పరిసరాల్లో నిర్మానుష్య ప్రాంతంలో ఇన్నోవా ఆపారు. బాలికను కారులో ఉంచి అంతా కిందికి దిగారు. ఆపై చింతల్‌మెట్‌ బాలుడు, సాదుద్దీన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు, హైదర్‌గూడ బాలుడు, కార్పొరేటర్‌ కుమారుడు ఒకరి తర్వాత ఒకరు కారులో ఎక్కి ఆమెపై అఘాయిత్యం చేశారు.

తర్వాత బాలికను పబ్‌ వద్ద వదిలేశారు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి వెళ్లిపోయారు. గత నెల 31 వరకు ఎవరి ఇళ్లలో వారు ఉన్నారు. ఆ రోజు కేసు విషయం బయటికి రావడంతో ఫోన్లు స్విచాఫ్‌ చేసుకుని పరారయ్యారు.

గాయాలు చేసి.. బెదిరించి..
నిందితులు అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాలిక శరీరంపై గోళ్లతో రక్కి, కొరికి గాయాలు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులకు నివేదిక ఇచ్చిన వైద్యులు.. బాధితురాలి ఒంటిపై 12 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మెడపై తీవ్రగాయాలు ఉన్నట్టు పేర్కొన్నారు. బాలికపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. వాటిని తొలగించాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ సంస్థకునోటీసులిచ్చారు. 

పోలీసు కస్టడీకి ఎమ్మెల్యే కుమారుడు
రొమేనియా బాలికపై అఘాయిత్యం కేసులో జువెనైల్‌ కోర్టు తొలుత ముగ్గురు మైనర్లను.. తర్వాత ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌ను పోలీసు కస్టడీకి అనుమతించింది. తొలుత అనుమతించిన మేరకు పోలీసులు శుక్రవారం ముగ్గురు మైనర్లను జువెనైల్‌ హోంలో విచారించారు. శనివారం నుంచి మొత్తం ఐదుగురు మైనర్లను ఠాణాకు తరలించి ప్రశ్నించనున్నారు.

సివిల్‌ దుస్తుల్లో ఉండే పోలీసులు రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. న్యాయవాదుల సమక్షంలో వారిని విచారించనున్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా, ఆపై అందరినీ ఒకేసారి ప్రశ్నిస్తూ.. సాదుద్దీన్‌ వాంగ్మూలంలోని అంశాలు, సీసీ కెమెరా ఫుటేజీలను ప్రస్తావిస్తూ విచారణ చేయనున్నారు. మరోవైపు ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్‌ చేసిన మరో ఇద్దరిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు