ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. ఇదేం పాడు పని

7 May, 2021 08:27 IST|Sakshi

ఎస్‌బీఐ బ్యాంక్‌లో కారు లోన్‌ తీసుకుని పరార్‌ 

గతంలో మూడు చెక్‌బౌన్స్‌ కేసుల్లో నిందితుడు 

తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు  

సాక్షి, హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌) : వృత్తిపరంగా నిజామాబాద్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇలా తప్పులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగిడిని ఎట్టకేలకు నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా రామ్‌గర్‌ గ్రామంలోని పీహెచ్‌సీ సెంటర్‌లో మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనూప్‌ దేవదాసన్‌.. నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నాడు.

2018లో హిమాయత్‌నగర్‌ ఎస్‌బీఐ టచ్‌ బ్యాంక్‌లో ఇన్నోవా కారు కోసం లోన్‌ తీసుకున్నాడు. దీని ఖరీదు రూ.19 లక్షలు. బ్యాంక్‌ వాళ్లకు పత్రాల్లో అనూప్‌దేవదాసన్‌ అడ్రస్‌లో హిమపురి కాలనీ, మన్సురాబాద్, ఎల్బీనగర్‌ ఉంది. మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాడు. ఆ తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం మానేశాడు. ఈ విషయంపై పలుమార్లు బ్యాంక్‌ అధికారులు పత్రాల్లో ఇచ్చిన అడ్రాస్‌ ఇంటికి వెళ్లగా అనూప్‌దేవదాసన్‌ అనే వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని అక్కడి వారు చెప్పారు. ఫోన్‌ నంబర్లు మార్చి, అడ్రస్‌లు వేర్వేరు చెబుతూ బ్యాంక్‌ అధికారులను తిప్పలు పెట్టడం సాగాడు. దీంతో 2019 ఆగస్టు 8న బ్యాంక్‌ అధికారులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నట్లు సమాచారం రావడంతో గురువారం అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  

మూడు చెక్‌బౌన్స్‌ కేసుల్లో నిందితుడు 
అనూప్‌ దేవదాసన్‌ చెక్‌ బౌన్స్‌ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని వారికి చెక్‌లు ఇచ్చాడు. చెక్‌బుక్‌లు పోయాయని కొత్త చెక్‌బుక్‌ల కోసం అప్‌లై చేస్తుండేవాడు. ఇలా డబ్బులు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడంతో వారు కోర్టులను ఆశ్రయించగా మూడు చెక్‌బౌన్స్‌ కేసుల్లోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.  

( చదవండి: పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా.. )

మరిన్ని వార్తలు