విద్యార్థినిపై అధ్యాపకుల అనుచిత ప్రవర్తన

12 Feb, 2021 15:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీపై కేసు 

సాక్షి, హైదరాబాద్‌: ఈవెంట్‌ పేరిట ఇంటికి పిలిపించుకొని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంనగర్‌లోని సన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో ఓల్డ్‌ ఆల్వాల్‌కు చెందిన ఓ విద్యార్థిని ఫైనలియర్‌ చదువుతోంది. జనవరి 24న ఈవెంట్‌ ఉందని చెప్పడంతో ఆమె తన సోదరుడిని తీసుకొని మాదాపూర్‌ చందానాయక్‌ తండాలోని వైస్‌ ప్రిన్సిపాల్‌ కల్యాణ్‌ వర్మ ఇంటికి వచ్చింది.

సోదరుడు బయటే ఉండగా విద్యార్థిని ఇంట్లోకి వెళ్లింది. కల్యాణ్‌ లోపలికి పిలిచి ఆమెపై చేయివేసి అనుచితంగా ప్రవర్తించాడు. తప్పించుకుని బయటకు వెళ్తుండగా హెచ్‌వోడీ రవీందర్‌ మెయిన్‌డోర్‌ను మూసేసి విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇద్దరినీ ప్రతిఘటించి తలుపులు తీసుకొని బయటకు పరుగుతీసింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా విద్యార్థిని కుటుంబీకులతో నిందితులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 9న మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం గాలిస్తున్నామని మాదాపూర్‌ సీఐ చెప్పారు. 

విద్యార్థి సంఘాల ఆందోళన 
కల్యాణ్‌ శర్మ, రవీందర్‌లపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థి నేతలు సన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.  కళాశాల డైరెక్టర్‌ వాణి ఒక మహిళ అయ్యుండి బాధితురాలి పక్షాన మాట్లాడకుండా బేరసారాలకు దిగారని ఆరోపించారు. ఆమెను ఘెరావ్‌ చేశారు.

మరిన్ని వార్తలు