భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. ఆమె డబ్బు కొట్టేయాలని ప్లాన్‌ 

20 Feb, 2023 09:19 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డబ్బుల కోసం కట్టుకున్న భార్యను, చనిపోయిన కన్న తల్లినీ మోసం చేశాడు. భార్యకు తెలియకుండా విడాకులు ఇవ్వడమే కాకుండా ఆమె పేరున ప్రాపర్టీ కొనుగోలు చేసి, ప్రతి నెలా ఈఎంఐ కిరికిరిలో భార్యను ఇరికించేశాడు! చనిపోయిన తల్లి సంతకం ఫోర్జరీ చేసి డబ్బు కాజేశాడు. ఈ సొమ్ము భార్య, భర్తల జాయింట్‌ ఖాతాలో జమకావడంతో తన ప్రమేయం లేకుండానే అటు బాధితురాలు, ఇటు నిందితురాలిగా మారింది ఓ భార్య! విచిత్రమైన ఈ కేసు గచి్చ»ౌలి మహిళా ఠాణాలో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. 

మాదాపూర్‌కు చెందిన అభిషేక్, అర్చన (పేర్లు మార్చాం)లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఆ యువ జంట ఆ్రస్టేలియా వెళ్లింది. నాలుగైదు ఏళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత అతడి అసలు రంగు బయటపడింది. చీటికీమాటికీ భార్యతో గొడవ పడుతుండటంతో అదే సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల రీత్యా.. ఆమె ఇండియాకు తిరిగొచ్చేసింది.దీంతో అభిషేక్‌ తన భార్య వెళ్లిపోయిందని విడాకులను కావాలని ఆ్రస్టేలియాలో కోర్టును ఆశ్రయించడంతో అక్కడి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. 

విడాకుల విషయం దాచి.. 
ఆ తర్వాత ఇండియాకు వచ్చిన అతను భార్యకు విడాకుల విషయం చెప్పకుండా దాచేశాడు. అప్పటికే ఆమె గచి్చ»ౌలిలోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. లక్షల్లో వేతనం కావటంతో ఆమె బ్యాంకు ఖాతాలోని డబ్బును ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. ఎంచక్కా.. ఇద్దరి పేరున ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరిచాడు. భార్యను సహ యజమానురాలిగా పెట్టి బ్యాంకు రుణంతో ఓ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. బ్యాంకు నెలవారీ వాయిదా ఆమె అకౌంట్‌ నుంచి జమ అయ్యేలా ప్లాన్‌ చేశాడు. అయితే ప్రాపర్టీ మీద వచ్చే అద్దె డబ్బును సొంతానికి వాడుకుంటున్నాడు.  

చనిపోయిన తల్లి డబ్బు కాజేయాలని.. 
గతంలోనే అభిషేక్‌ తల్లి చనిపోయింది. అయితే ఆమె బ్యాంకు ఖాతాలోనే డబ్బు ఉందని తెలుసుకున్న అతను.. ఎలాగైనా దాన్నీ కొట్టేయాలని మరో స్కెచ్‌ వేశాడు. తల్లి బ్యాంకు చెక్‌ తీసుకొని అమ్మ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ చెక్‌ను ఉమ్మడి ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్‌ చేసి.. రూ.లక్షల్లో సొమ్ము తీసుకున్నాడు. ఈ విషయం అభిషేక్‌ సోదరికి తెలియడంతో ఆమె పోలీసు స్టేషన్‌లో ఫోర్జరీ కేసు పెట్టింది. దీంతో పోలీసులు అభిషేక్‌ను విచారించగా.. బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

ఆ అమ్మాయి తన భార్య కాదని అందుకే తనపై 498ఏ కేసు పెట్టేందుకు ఆమె అర్హురాలు కాదని అభిషేక్‌ పోలీసులతో వాగ్వాదం దిగడం కొసమెరుపు. అనధికారికంగా తల్లి ఖాతాలోని డబ్బు భార్య, భర్తలు ఉమ్మడి ఖాతాలోనే జమైంది కాబట్టి.. పోలీసులు భర్తతో సహా భార్యపై కూడా కేసు పెట్టారు. దీంతో ఆమె ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైంది.
చదవండి:  వివాహిత కిడ్నాప్.. కారులో తిప్పుతూ లైంగిక దాడి

మరిన్ని వార్తలు