Satyendra Singh Shekawat Thefts: హైటెక్‌ దొంగ.. చోరీ చేసిన కార్లను..

16 May, 2022 10:20 IST|Sakshi

ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అమ్మిన సత్యేంద్ర

రూ.10 లక్షలు వెచ్చించి చైనా నుంచి ఉపకరణాలు

ఇంటర్నెట్, డార్క్‌వెబ్‌ ద్వారా ‘చోరీ మెలకువలు’

హైదరాబాద్‌ పోలీసుల విచారణలో వెలుగులోకి

సాక్షి,హైదరాబాద్‌: హైటెక్‌ పంథాలో హైఎండ్‌ కార్లను చోరీ చేసే ఘరానా దొంగ సత్యేంద్ర సింగ్‌ షెకావత్‌ను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు విచారించారు. బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ స్టార్‌ హోటల్‌లో గతేడాది జనవరి 26న జరిగిన కన్నడ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ వి.మంజునాథ్‌ కారు తస్కరణ కేసులో కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడి వ్యవహార శైలికి సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.   

∙స్వస్థలమైన జైపూర్‌లో ఉండగానే దూరవిద్య విధానంలో ఎంబీఏ పూర్తి చేసిన షెకావత్‌ ఆపై బతుకుతెరువు కోసం నాసిక్‌ చేరాడు. అక్కడి ఒక టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తన విధుల్లో భాగంగా అనేక మంది టూరిస్టుల్ని తన కారులో ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌కు తీసుకువెళ్లే వాడు. ఇలా ఇతగాడికి పార్కింగ్‌ లాట్స్‌లో ఉన్న లోపాలు తెలిసి కార్ల చోరీలు ప్రారంభించాడు.  

∙ఆటోమేటిక్‌ కాని కార్ల తాళాలను కేవలం 60 సెకన్లలో తెరవడం  ఇతడి ప్రత్యేకత. ఇక పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఆటోమేటిక్‌ కార్ల కోసం రెండు నుంచి మూడు నెలల పాటు ‘కష్టపడతాడు’. తొలుత టార్గెట్‌ చేసిన ప్రాంతానికి వచ్చి వాహనం చాసిస్‌ నంబర్‌/ఇంజిన్‌ నంబర్లను చాకచక్యంగా ఫొటో తీసి తిరిగి తన స్వస్థలానికి వెళ్లిపోతాడు.  

ఆ ఫొటోను ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ చేస్తాడు. దాని ఆధారంగా ఆ యాప్‌ వాహనం తాళం మోడల్‌ను చూపిస్తుంది. ఈ వివరాలతో మారు తాళం తయారు చేస్తాడు. ఇందుకు అవసరమైన హ్యాండీ బేబీగా పిలిచే కీ డేటా స్కానర్, ఎక్స్‌ హార్స్‌ డాల్ఫిన్‌ కీ కటింగ్‌ మిషన్‌ తదితరాలను చైనా నుంచి రూ.10 లక్షలు వెచ్చించి దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.  

ఇలా మారు తాళం తయారు కావడానికి, తిరిగి ఆ కారు దగ్గరకు రావడానికి ఒక్కోసారి గరిష్టంగా రెండు నెలలు పట్టేది. కారు చోరీ చేసిన తర్వాత సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఆగి దాని నంబర్‌ ప్లేట్‌ మారుస్తాడు. ఆపై దగ్గరలో ఉన్న పార్కింగ్‌ లాట్‌లో నాలుగైదు రోజుల పాటు పార్క్‌ చేసి ఉంచుతాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న లాడ్జిల్లో నకిలీ ఐడీ లతో బస చేసి కారును గమనిస్తూ ఉంటాడు.  

చోరీ కార్లను రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన డ్రగ్‌ పెడ్లర్స్‌కు పత్రాలు లేకుండా విక్రయించాడు. ఇలాంటి ఖరీదైన కార్లలో డ్రగ్స్‌ రవాణా చేస్తే ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో అనేక మంది పెడ్లర్స్‌ ఇతడి నుంచి ఈ కార్లు ఖరీదు చేసేవారని పోలీసులు చెప్తున్నారు. ఆ కార్లను ఒక్కోసారి తక్కువ ధరకు, కొన్నిసార్లు లాభసాటి ధరకు విక్రయించేవాడు.  

ఇలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ఇతడికి అలవాటు. గోవా, మహారాష్ట్రల్లో ఉన్న అన్ని స్టార్‌ హోటళ్లు, బీచ్‌ రిసార్టులు షెకావత్‌కు సుపరిచితమే. యూట్యూబ్‌తో పాటు ఇంటర్‌నెట్, డార్క్‌ నెట్‌పై మంచి పట్టున్న షెకావత్‌ ఎప్పటికప్పుడు కార్లు చోరీ చేసే విధానాలను వాటి ద్వారానే తెలుసుకుంటూ అప్‌డేట్‌ అవుతుంటాడని పోలీసులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు